Dasoju Shravan: బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు!
Dasoju Shravan: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించారు.
Dasoju Shravan: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్, వివేక్ వెంకట స్వామి సమక్షంలో రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో దాసోజు శ్రవణ్ మనస్తాపం చెందారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి శనివారం దిల్లీకి వెళ్లారు. తరుణ్ చుగ్ నివాసంలో చర్చలు జరిపారు. బీజేపీ నాయకుల సమక్షంలో నేటి ఉదయం కాషాయ కండువా కప్పుకున్నారు.
తెలంగాణలో రాబోయేది బీజేపీనే..
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల్లోకి తీసుకు వెళ్తామని శ్రవణ్ చెప్పారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పని చేశానని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు దాసోజు. ఇన్ని రోజులు వేరే పార్టీల్లో ఉన్న తర్వాత తిరిగి బీజేపీలోకి రావడం సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లు దాసోజు శ్రవణ్ అభిప్రాయ పడ్డారు. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు పడ్డాయని వెల్లడించారు. ఎంతో పోరాడి, ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణ, ఇప్పుడు దొరలపాలు అయిందని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే, బడుగులు, బలహీనులు, వెనక బడిన వర్గాలు బాగు పడతాయని అంతా అనుకున్నారని, కానీ పరిస్థితులు మరింత దిగజారాయని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎనిమిదేళ్లలో ఏం చేశారు..
ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్టును కూడా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని ఆరోపణలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెలంగాణ ప్రత్యేకం రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామన్న శ్రవణ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్తితి లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నారని విమర్శించారు. తెలంగాణలో వేలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నా... ప్రభుత్వం నియామకాలు చేపట్టడం లేదని అన్నారు. ఖాళీలను భర్తీ చేయడం తెలిపారు. నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేశారని, విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటూ దాసోజ్ శ్రవణ్ తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు భోజనం కూడా మానేసి నిరసనలు చేయడం ప్రభుత్వం చేత కాని తనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. తెలంగాణ ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాల భూమిని దోచుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికోటి ప్రవీణ్ వెనుక ఉన్న టీఆర్ఎస్ నాయకులేనని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీనే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.