Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్ ప్రసంగంలో హరీష్ విమర్శలు
Telangana Budget 2024: అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ చర్చలో ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఎనిమిది నెలల్లో ప్రజలకు ధోకా చేశారని ఆరోపించారు. హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు.
Telangana Assembly: తెలంగాణ బడ్జెట్‌పై అసెంబ్లీలో హోరాహోరీ చర్చసాగింది. మాజీ మంత్రి హరీష్‌రావు అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. అంకెల గారడీతో మభ్యపెట్టేందుకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. హరీష్‌రావు చేసిన ఆరోపణలకు అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఇలా వాడీవేడిగా సాగింది బడ్జెట్ డిస్కషన్.
రాష్ట్రంలో దశదిశా లేని పాలన నడుస్తోందని ఆరోపించారు హరీష్‌రావు. భట్టి విక్రమార్క, తాను రోడ్లపైకి వెళ్లి ప్రజలను అడుగుదాని సవాల్ చేశారు. ఎవరి హయాంలో కరెంటు సరఫరా బాగుందో ప్రజలు చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడా విద్యుత్ సరఫరా సరిగా లేదని ఆరోపించారు. ప్రజాసమ్యలను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసుకొనే బడ్జెట్ ప్రసంగం సాగిందని విమర్శించారు. తమ పార్టీని తిట్టడం తప్ప ఎనిమిది నెలల్లో సాధించిందేంటని ప్రశ్నించారు హరీష్.
ఆదాయం ఎక్కడిది?
7700 కోట్లు ఆదాయం వస్తుందని చెప్పారు కానీ ఎలా వస్తుందో చెప్పలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని అన్నారు. రిజిస్ట్రేషన్లు పడిపోయాయని ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఇలా ఆదాయం తగ్గిపోతుంటే ఆదాయాన్ని ఎలా సమకూరుస్తారో బడ్జెట్‌లో చెప్పలేదన్నారు.
తాగిస్తూ ఆదాయం తెస్తారా
ఎక్సైజ్ శాక ఆదాయం 25వేల కోట్ల నుంచి 42 వేల కోట్లకు పెంచారని అంటే గల్లీకో బెల్ట్ షాపు పెడతారా అని నిలదీశారు. హరీష్ కామెంట్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. 2014లో పదివేల కోట్ల ఆదాయం ఉండే ఎక్సైజ్ శాఖ ఆదాయం 19వేల కోట్లకు పెరిగిందన్నారు. అదే గతేడాదికి 35వేల కోట్లకు పెరిగినట్టు లెక్కలు ఉన్నాయని గుర్తు చేశారు. సభను తప్పుదారి పట్టించే ప్రయత్నాల్లో హరీష్ ఉన్నారని ఆరోపించారు భట్టి విక్రమార్క. తాము ఎక్కడా గల్లీకో బెల్ట్‌షాప్ పెడతామని చెప్పలేదని అన్నారు. పదేళ్లుగా మభ్యపెట్టిన బీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా అలానే చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ ఆదాయం ఎలా పెంచుతారో చెప్పాలన్నారు హరీష్. ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తారా అని ప్రశ్నించారు. భూములు అమ్మి పదివేల కోట్లు, మరో 14వేల అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ద్వారా ఆదాయం అని చెప్పారని... ఆదాయ మార్గాలు చెప్పకుండా 24వేల కోట్ల సంగతేంటని ప్రశ్నించారు.
రుణమాఫీలో కోతలు
రుణమాఫీ కోసం 31 వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెబితే... బడ్జెట్ 26 వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించారన్ని తెలిపారు హరీష్. ఐదు వేల కోట్లను కోసేశారన్నారు. రుణమాఫీ కోత విధించారని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకం నిధులు కేటాయింపు పెంచడం సంతోష,ంగా ఉన్నా... వైద్యశాక బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తే ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
ధోకా.. ధోకా.. ధోకా...
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా ఇచ్చిందన్నారు హరీష్ రావు. 8 నెలల్లో ఎన్ని ధోకాలు ఇచ్చారో అని పెద్ద లిస్ట్ చదివారు. ప్రతి మహిళలకు నెలకు 2500 ధోకా.. రైతు భరోసా కింద రైతన్నకు ధోగా, కౌలు రైతుకు 15 వేలు -ధోకా, డిసెంబర్ 9 న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ - ధోకా, అన్ని పంటలకు మద్దతు ధరపై 500 బొనస్ -ధోకా, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు -ధోకా, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ -ధోకా, 25 వేల పోస్టులలో మెగా డిఎస్సీ - ధోకా, వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు -ధోకా, నిరుద్యోగ భృతి -ధోకా ఇచ్చారన్నారు. ధోకా, ధోకా,ధోకా... కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకా పార్టీ అని ఆరోపించారు.
మమ్మల్ని చూపండి
అసెంబ్లీలో తాము మాట్లాడుతుంటే కెమెరాలు తమవైపు చూపించడం లేదని హరీష్ రావు స్పీకర్‌రు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌లో అలా చూపించడం లేదని లోక్‌సభలో రాహుల్ పోరాడుతున్నారని.. ఆయన్ని అనుసరించే నేతలు ఇక్కడ కూడా ప్రతిపక్షాలను టీవీల్లో చూపించాలని సూచించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు స్పందించి రాహుల్ గాంధీ కంటే పది రెట్లు ఎక్కువ ప్రతిపక్షాలను చూపిస్తున్నాం అన్నారు. రాహుల్ గాంధీ బాటలో మేం నడుస్తున్నామని పేర్కొన్నారు. స్పీకర్ కూడా హరీష్‌రావు కామెంట్స్‌ను ఖండించారు.