BRS Leaders Arrest: బీఆర్ఎస్ నేతల అరెస్ట్, హరీశ్ చేతికి గాయం! రెండు గంటలుగా రోడ్లపైనే తిప్పుతున్న పోలీసులు
Kaushik Reddy ఇంటిపై మరో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అనుచరులు చేసిన దాడిపై బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Cyberabad CP News: సైబరాబాద్ కమిషనరేట్ ముందు ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా తరలించారు. దాదాపు రెండు గంటలుగా వారు నిరసనలు ఆపకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై మరో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. అయితే, అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కేసు బనాయించి వారిపై చర్యలు తీసుకుంటేనే తాము అక్కడి నుంచి కదులుతామని లేదంటే అర్థరాత్రి అయినా అక్కడే ఉంటామని తేల్చి చెప్పారు.
గురువారం సాయంత్రం నుంచి బీఆర్ఎస్ నేతల నిరసన సైబరాబాద్ సీపీ కార్యాలయంలో కొనసాగుతుండడంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలు అందర్నీ అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తమను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని, బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో కుక్కేశారని.. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ ఒత్తిడిలోనే హరీష్ రావు చేతికి తీవ్ర గాయం అయిందని చెప్పారు.
శంషాబాద్ వైపు ఓ వాహనం, మహబూబ్ నగర్ వైపు మరొకటి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులను అక్రమంగా అరెస్ట్ చేసి కల్వకుర్తి వైపు తీసుకువెడుతున్నారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిలో పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజీవ్ సాగర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
అరెస్టు చేసిన వారిని రెండు వాహనాల్లో రెండు వేర్వేరు చోట్లకు తీసుకెళ్తుండడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మహబూబ్ నగర్ తరలించారని మాజీ హరీశ్ రావు ఓ వీడియో విడుదల చేశారు. న్యాయం కోసం సీపీ ఆఫీసుకు వస్తే తమను అరెస్టు చేసి.. ఇష్టమొచ్చిన చోట తిప్పుతున్నారని అన్నారు.
రోడ్లపైనే తిప్పుతున్న పోలీసులు
అయితే, సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రోడ్లపై తిప్పుతూనే ఉన్నారు. గత మూడు గంటలుగా 100 కిలోమీటర్లకు పైగా రోడ్లపైనే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు తిప్పారు. ఒక వాహనాన్ని తలకొండ పల్లి మరో వాహనాన్ని కేశంపేట వైపు పోలీసులు తీసుకెళ్లారు. దీంతో ఆ వాహనాలు వస్తున్నాయని తెలుసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకునేందుకు యత్నించారు. తలకొండ పల్లి వద్ద రోడ్డుకు అడ్డుపడి బీఅర్ఎస్ ఎమ్మెల్యేలను తరలిస్తున్న వాహనాన్ని గ్రామ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అటు కొత్తపేట వద్ద వెయ్యి మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని బీఆర్ఎస్ నాయకులను తరలిస్తున్న వాహనాలను అడ్డగించారు.