Eatala Rajender On KCR: తెలంగాణలో విద్యార్థులకు కుళ్లిన కూరగాయలు, గుడ్లు పెడుతున్నారు: ఈటల
రాష్ట్రంలో నష్టం జరిగింది సాయం చేయండి అని కేంద్రంను కోరే సంస్కారం కూడా కెసిఆర్‌కి లేదన్నారు ఈటల. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కేంద్రాన్ని బీజేపీ కోరడంతో కేంద్రం బృందాలు పంపిస్తోందన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం కమలాపుర్ హాస్టల్‌లో విషాహారం తిని పిల్లలు అస్వస్థతకు గురవ్వడం తెలంగాణలో సాధారణమైపోయిందని ఆరోపించారు ఈటల రాజేందర్. అధికారులు పని చేయడం లేదు అనడానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. సకాలంలో బిల్లులు రాక, కాంట్రక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో కల్తీ సరకులు తీసుకువచ్చి పిల్లలకు భోజనం పెడుతున్నారని తెలిపారు.
10/10 మార్కులు వచ్చిన టాప్ పిల్లలకు మాత్రమే బాసర IIIT లో సీటు దొరికుతుందని... అలాంటి పిల్లలకు కనీస వసతులు కలిపించకపోవడం దారుణమన్నారు ఈటల. భోజనం సరిగా పెట్టకపోవడం, కంప్యూటర్స్, లాప్టాప్ ఇవ్వకపోవడంతో రోజుల తరబడి ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అంత పెద్ద ఆందోళన జరిగిన తరువాత కూడా మళ్లీ ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుందన్నారు.
మెదక్ ఐఐటీలో వసతులు లేవు అని సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు ఈటల. మధ్యాహ్న భోజనం వండేవాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో పుచ్చిపోయిన కూరగాయలు, కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఆరోపించారు. దీని కారణంగానే పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు.
ధనిక రాష్ట్రమని పేదల కోసమే తాను పుట్టాను అని చెప్పుకొనే కెసిఆర్... అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల, ఎవరికీ అధికారం ఇవ్వకపోవడంతో అందరూ గాలికి దీపం పెట్టి పని చేస్తున్నారన్నారు ఈటల. అందుకే ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యం అయ్యాయని ఆరోపించారు. పర్ కాపిటా ఇన్కమ్ పెరిగింది అని చెప్పే కెసిఆర్ వాస్తవ పరిస్థితిని గమనించాలని సూచించారు.
కరోనా వల్ల ఆర్థికస్థితి దిగజారి... పిల్లల ఫీజుల కట్టే పరిస్థితి లేదన్నారు ఈటల. ప్రభుత్వ పాఠశాలల్లో వేస్తే వారికి సరిగా బువ్వ పెట్టకపోవడంతో తల్లిదండ్రుల గుండె మండిపోతుందన్నారు. కెసిఆర్‌కు తన వెన్ను తాను చూసుకోలేరని... ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాలని సూచించారు. ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను బానిసలుగా చేసుకున్నారని... వాస్తవాలు చెప్పే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు ఈటల.
వరదల్లో కూడా టీఆర్‌ఎస్ బురద రాజకీయం చేస్తుందని ఆరోపించారు ఈటల. మంచిర్యాలలో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చాయని... 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మునిగాయిని.. లోపం ఎక్కడో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మునిగిన అన్నీ ప్రాంతాలను కాపాడాల్సిన సీఎం... కేవలం భద్రాచలం మాత్రమే నష్ట పరిహారం ఇవ్వడం ఏంటి ప్రశ్నించారు. మిగతా ప్రాంతాల ప్రజాప్రతినిధులు అడగరా అని నిలదీశారు.
రాష్ట్రంలో నష్టం జరిగింది సాయం చేయండి అని కేంద్రంను కోరే సంస్కారం కూడా కెసిఆర్‌కి లేదన్నారు ఈటల. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కేంద్రాన్ని బీజేపీ కోరడంతో కేంద్రం బృందాలు పంపిస్తోందన్నారు. మెడిగడ్డ సుండిల్ల పంప్ హౌస్‌లు మునిగిపోవడానికి కారణం ఇంజనీరింగ్ లోపమని కేసీఆర్ సూచనల పాటించడం వల్లే నష్టం జరిగిందన్నారు. లెవెల్ చూసుకోకుండా పంప్ హౌజ్ నిర్మాణ చేయడమా ? నీళ్ళు అపే గోడలు కట్టకపోవడమా ? నాణ్యతా లోపమా ? ప్రభుత్వం చెప్పాలన్నారు. ఇది ఎలా జరిగింది అని పరిశీలన చేయాల్సింది నిపుణులు, మీడియావాళ్లను కానీ అక్కడికి పంపించడం లేదన్నారు.
ప్రజా ఆస్తులు పరిశీలన చేసే అవకాశం ఇవ్వకపోవడం ఏంటి? అది సీఎం కేసీఆర్ ఫామ్ హౌసా అని నిలదీశారు ఈటెల. వరదల వల్ల వందల గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఏ వ్యాధులు వస్తాయి, ఏ మందులు కావాలో సిద్దం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కోతకు గురి అయిన భూములు ప్రభుత్వమే సరి చేయాలని డిమాండ్ చేశారు ఈటల. ఇసుక మేటలు ప్రభుత్వమే తొలగించాలన్నారు. కేంద్రం ఇచ్చే ఫసల్ బీమా రాకుండా చేశారన్నారు. అదే ఉంటే రైతులందరికీ మేలు జరిగేదన్నారు. ఒక పంటకి ఎంత దిగుబడి వస్తోందో లెక్కగట్టి అంత డబ్బు రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో మంచి పంటలు పండే భూములు.. నాణ్యత లేని కాలువ కట్టలు కట్టడం వల్ల పాడవుతున్నాయని అన్నారు ఈటల. ఈ భూములను కూడా సేకరించాలని డిమాండ్ చేశారు. నీరో చక్రవర్తిలా వ్యవహరించవద్దని కేసీఆర్‌కు ఈటల సూచించారు. ఇప్పటికైనా సరిగ్గా పరిపాలన చెయ్యాలన్నారు. లేదంటే చేత కాదు అని చెప్పి రాజీనామా చెయ్యమని డిమాండ్ చేశారు.