Ganesh Immersion Rules: గణేష్ నిమజ్జనం నిబంధనలివే! - హైదరాబాద్ పోలీసుల కీలక ప్రకటన
Hyderabad News: గణేష్ నిమజ్జనం సందర్భంగా నిబంధనలు పాటించాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సిటీ పరిధిలో 15 వేలు, ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు.
Ganesh Immersion Rules: గణేష్ నిమజ్జనం (Ganesh Immersion) కోసం భాగ్యనగరం సిద్ధమవుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు, ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. మండపం నిర్వాహకులు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తున్నారని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం లేదని అన్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరో 8 వేల మంది సిబ్బంది నిమజ్జనం బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. అదే సమయంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం ఉన్నందున మతపెద్దలతో సమన్వయం చేస్తున్నామని అన్నారు. ఈ నెల 17న పబ్లిక్ గార్డెన్‌లో ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం, పెరేడ్ గ్రౌండ్‌లో మరో కార్యక్రమం ఉందని సీపీ ప్రకటించారు. నిమజ్జనం చూసేందుకు వచ్చే భక్తులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ రూల్స్ తప్పనిసరి
Precautionary measures for Ganesh immersion procession. Dial 100 in any Emergency. #BeSafe #GaneshChaturthi #GaneshChaturthi2024 #GaneshNavaratri #HyderabadCityPolice pic.twitter.com/hzCHX7OyPY
— Hyderabad City Police (@hydcitypolice) September 13, 2024
- ఒక విగ్రహానికి ఒక వాహనానికే అనుమతి. ఆ వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.
- నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌ను అనుమతించరు.
- రంగులు పిచికారీ చేయడానికి కాన్ఫెట్టీ గన్స్ ఉపయోగించకూడదు.
- మద్యం మత్తులో ఉన్న వారిని, మత్తు పదార్థాలు కలిగి ఉన్న వారిని విగ్రహం ఉన్న వాహనాల్లోకి అనుమతించరు.
- రహదారిపై వెళ్లేటప్పుడు వాహనం ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదు.
- విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఆగకూడదు.
- అప్పటి పరిస్థితి బట్టి వాహనాల రాకపోకలపై పోలీస్ అధికారులు ఆదేశాలిస్తారు.
- ఊరేగింపులో ఎవరూ కర్రలు, కత్తులు, మారణాయుధాలు, మండే వస్తువులు, ఇతర ఆయుధాలు తీసుకెళ్లకూడదు.
- జెండాలు, అలంకరణ కోసం పెట్టే కర్రలు 2 అడుగులకు మించకూడదు.
- ఊరేగింపులో ఎలాంటి రెచ్చగొట్టే, రాజకీయ ప్రసంగాలు, నినాదాలు, రెచ్చగొట్టే సంకేతాలతో కూడిన బ్యానర్లు ఉపయోగించొద్దు.
- ఏ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు.
- ఊరేగింపు సమయంలో బాణాసంచా కాల్చరాదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలి.
Also Read: CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు