CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Telangana News: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. రాష్ట్రంలో రాజకీయ కుట్రలను సహించేది లేదని అన్నారు.
![CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు cm revanth reddy key orders to dgp on law and order issue CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/13/0732740de0dd3a6152bf777e79bd33451726204273472876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Revanth Reddy Orders On DGP: ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుండడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై స్పందించారు. అధికారం కొల్పోయామనే అక్కసుతో కొందరు కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇబ్బంది కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను (DGP Jitendar) ఆదేశించారు. రాజకీయ కుట్రలు సహించేది లేదని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం శాంతిభద్రతలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
'అలాంటి వారిని వదలం'
హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని.. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించొద్దని డీజీపీ పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని.. రాష్ట్ర ప్రతిష్టను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడాలని అన్నారు.
కాగా, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదం క్రమంలో గురువారం నుంచి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు దాడికి పాల్పడగా.. బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చిన క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ నివాసం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలను సైతం ఎవరినీ కలవనీయడం లేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను సైతం అడ్డుకున్నారు.
'లక్కీ నెంబర్ మా దగ్గర ఉంది'
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'మా ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీలు పదే పదే చెప్పాయి. అయితే, కేసీఆర్ లక్కీ నెంబర్ మా దగ్గర ఉన్నందున ప్రభుత్వానికేమీ ఢోకా లేదు. ఉప ఎన్నికలొస్తాయని బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు యత్నిస్తోంది. కేసీఆర్ కోసం కొత్త రాజ్యాంగమేమీ ఉండదు. ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మాట్లాడకుండా తొలిరోజు నుంచే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారు. మేం నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం.' అని రేవంత్ పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)