Huzurabad Badvel Counting: నేడే హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్.. కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర
నేడు (మంగళవారం) హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తేలనుంది. విజయం పార్టీలు ధీమాగా ఉన్నా ఓటర్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్ ఉపఎన్నిక మినీ యుద్ధాన్నే తలపించింది. నేతల మాటల యుద్ధంతో మొదలైన ఎన్నికల ప్రచారాలు... ముష్టిఘాతాలతో ముగిశాయి. ప్రలోభాలు, తాయిలాలు, పథకాలు, బుజ్జగింపులు ఇలా సాధారణ ఎన్నికలను తలపించేలా హుజూరాబాద్ ఉపఎన్నిక హోరెత్తింది. హుజూరాబాద్ ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
22 రౌండ్లలో కౌంటింగ్
మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. తర్వాత ఈవీఎమ్ కౌంటింగ్ ప్రారంభిస్తారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసి 22 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. కోవిడ్ నిబంధనల పాటిస్తూ రెండు హాళ్లలో కౌంటింగ్ జరగనుంది. ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్‌కు 14 టేబుళ్లపై 14 ఈవీఎంలు లెక్కిస్తారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు
నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు
కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఈవీఎంలు భద్రపరిచారు. మంగళవారం కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడారు. 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కోసం నాలుగు హాళ్లలో 28 టేబుళ్ల ఏర్పాటు చేశామన్నారు. మరికొన్ని టేబుళ్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు. కౌంటింగ్ సూపర్ వైజర్, మైక్రో అజ్వర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహిస్తామని ఆర్వో తెలిపారు. ముందుగా 233 పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. తుది ఫలితం రాత్రి 8 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉందని ఎన్నికల అధికారి చెప్పారు. బద్వేల్ ఉపఎన్నిక కౌంటింగ్ పది రౌండ్స్ లో జరగనుంది.
Also Read: బద్వేలులో 70 శాతానికిపైగా పోలింగ్.. కలకలం రేపిన దొంగ ఓటర్లు !
గత ఎన్నికలో వైసీపీ విజయం
బద్వేల్ లో విజయం సాధిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,15,392 ఉండగా, 1,46,562 ఓట్లు నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో బద్వేల్ లో వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య గెలిచారు. ఆయన అకాల మరణంతో బద్వేల్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. బద్వేల్ ఉపఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీచేశారు. కానీ ప్రధానంగా వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీనెలకొంది. గత ఎన్నికల్లో లక్షా 58 వేల ఓట్లు పోలయ్యాయి. వీటిల్లో 60 శాతం ఓట్లు వైసీపీ అభ్యర్థికి వచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలులో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి.