Budvelu Bypolls : బద్వేలులో 70 శాతానికిపైగా పోలింగ్.. కలకలం రేపిన దొంగ ఓటర్లు !
బద్వేలులో 70 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐదు గంటల వరకే 60 శాతం పోలింగ్ నమోదైంది. దొంగ ఓటర్ల ఆరోపణలు మినహా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.
బద్వేల్ ఉప ఎన్నికలో 70 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. ఐదు గంటలకు అరవై శాతం వరకూ పోలింగ్ నమోదయింది. ఆరు గంటల వరకు సాధారణ ఓటర్లకు.. ఆ తర్వాత కోవిడ్ ఓటర్లకు ఓటు వేసేందుకు చాన్సిచ్చారు. సమయం ముగిసిపోయిన తర్వాత కూడా క్యూలైన్లలో ఉండే వారికి చాన్స్ ఇస్తారు కాబట్టి.. పోలింగ్ గణాంకాలు ఉదయానికి వెల్లడయ్యే అవకాశం ఉంది అయితే 70 శాతానికిపైగా పోలింగ్ నమోదవడం ఖాయమని చెప్పుకోవచ్చు.
బద్వేలులో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు జనసేన కూడా బరిలో నిలువ లేదు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీని టార్గెట్ చేసుకుని పని చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి.. ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేలా వ్యూహం పన్నారు. దాంతో వైసీపీ నేతలు ఓటర్లను భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలించుకోగలిగారు. అయితే చాలా చోట్ల దొంగ ఓటర్లు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. సమీప ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కొత్త వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. పోరుమామిళ్ళలో ప్రొద్దుటూరుకు చెందిన 10 మంది కొత్త వ్యక్తులను కాంగ్రెస్ శ్రేణులు గుర్తించి పట్టుకున్నారు. వారు పరుగులు తీసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Also Read: డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?
పోలింగ్ కొనసాగుతున్న సమయంలో మధ్యాహ్నం సమయంలో వర్షం పడింది. దీంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా విజయానంద్ పరిశీలించారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే అధికారులు వాటిని మార్చారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించినట్లుగా తెలిపారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధం అని ప్రకటించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో పోలింగ్ నమోదయ్యే చాన్స్ ఉంది.
Also Read: ప్రశాంతమైన కుప్పంలో రౌడీ రాజ్యం .. ఓటుతో బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి