(Source: ECI/ABP News/ABP Majha)
Note For Vote : డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?
ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా లేని జాడ్యం ఇండియాలో కనిపిస్తోంది. ఓటర్లకు డబ్బులిచ్చి ఓట్లు కొంటున్నారు. ఇప్పుడు ఓటర్లే తమకు డబ్బులివ్వాలని ధర్నాలు చేస్తున్నారు
ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది..? పేరుకు ప్రజలు ఎన్నుకుంటున్నారు.. కానీ వాస్తవానికి రాజకీయ నేతలు ఓటర్లను కొనుక్కుంటున్నారు. ఓట్లను కొనుక్కుంటున్నారు. ఎవరు ఎక్కువగా కొనుగోలు చేస్తే వారే ప్రజలకు ప్రతినిధి అవుతున్నారు. ప్రభుత్వాలూ అలాగే ఏర్పడుతున్నాయి. తాజాగా హుజురాబాద్ ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీల్లో తమకు డబ్బులివ్వలేదని ధర్నాలకు దిగడం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో కలికాలం ! ఓటుకు డబ్బులివ్వలేదని ఓటర్ల ధర్నా !
ఓటుకు నోటు తీసుకోవడం తప్పు అని ఎంతో కాలంగా ప్రచారం చేస్తున్నారు. కానీ అవి ప్రజలకు ఎక్కకపోగా ఇప్పుడు ఓటుకు నోటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో భారత ప్రజాస్వామ్య పతనం అత్యంత కీలక దశకు చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓటర్లు తమకు రాజకీయ పార్టీలు డబ్బులివ్వలేదని ధర్నాకు దిగుతున్నారు. హుజురాబాద్‌లో అడుగడుగునా ఈ దృశ్యాలు కనిపించాయి. ఏదో ఒక పార్టీ ఇస్తే కాదు.. బరిలో ఉన్న మూడు పార్టీలు తమకు డబ్బులివ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. హుజురాబాద్‌లో ఒక్కో ఓటుకు రూ. ఆరు వేల వరకూ రాజకీయ పార్టీలు పంచుతున్నాయి. ఒక్క ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఇరవై నాలుగు వేల రూపాయలు వారి ఇంటికి వస్తున్నాయి. అది ఒక్క పార్టీ ఇస్తే.. రెండో పార్టీ కూడా ఇస్తే నలభై ఎనిమిది వేలు చేతిలో పడతాయి. అంత కంటే కావాల్సింది ఏముందని ఓటర్లు ధర్నాలకు దిగుతున్నారు. ఏదో ఓ పార్టీ ఇచ్చి వెళ్లిపోతే కాదని.. రెండు పార్టీలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
నీతులు చెప్పే మాస్టార్లు కూడా డబ్బులు ఇవ్వందే ఓట్లేయడం లేదు !
నీతులు చెప్పే మాస్టార్ుల... సోషల్ మీడియాల్లో సందేశాలు చెప్పే లక్షలాది మంది ఓటర్లు ఓటు దగ్గరకు వచ్చే సరికి డబ్బులు ఇస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఓటును అమ్ముకోవడం అంటే దేశాన్ని అమ్ముకోవడమేనని ఎంత ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం ఓటు డబ్బులను డిమాండ్ చేసి మరీ తీసుకునే పరిస్థితి వచ్చింది. నిరుపేదలు మాత్రమే కాదు.. చివరికి కోటీశ్వరులు కూడా తమ ఓటు డబ్బులు తమకు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. దానికి సాక్ష్యం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీచర్స్ నియోజకవర్గ ఎన్నికల్లో తాయిలాలు పంచిన వారే గెలుపొందడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
డబ్బులు ఖర్చు పెట్టగలిగే వారికే పార్టీల టిక్కెట్లు !
ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే ఓ అభ్యర్థికి భారీగా డబ్బు ఖర్చు పెట్టే శక్తిని మొదటి అర్హతగా భావిస్తున్నారు. ఎన్నికలు వచ్చాయి అంటే పోటీ చేసే ఆర్థిక స్థోమత కలిగిన వ్యక్తులు కోట్లకు కోట్లు డబ్బులు వెదజల్లడం ప్రస్తుతం సహజమైన విషయంగా మారింది. డబ్బు ఉన్న వారికే రాజకీయ పట్టం కడుతున్నారుడబ్బులు లేని వారికి రాజకీయాల్లో చోటు లేదనే భావన మనదేశంలో చోటు చేసుకుంటోంది. ఒక్క నియోజకవర్గంలో ప్రభుత్వం పెట్టిన ప్రజాధనమే రూ. మూడు వేల కోట్లకుపైగా ఉంటే రాజకీయ పార్టీల ఖర్చు ఎంతో అంచనా వేయడం కష్టం. అన్ని పార్టీలు కలిసి హుజురాబాద్‌లో కనీసం రూ. ఐదు వందల కోట్ల బ్లాక్ మనీని పారించి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒక్క ఓటుకు రూ. ఆరు నుంచి పదివేలు ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు.
Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !
అమ్ముడుపోతే తమనే తర్వాత దోచుకుంటారని గుర్తించలేకపోతున్న ఓటర్లు !
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకొని ప్రజాసేవే పరమావధిగా పాటుపడేలా కృషి చేయడం. కానీ కోట్లకు కోట్లు డబ్బులు పంచి గెలిచిన అనంతరం వాటిని ఎలా సంపాదించుకోవాలో మాత్రమే సదరు ప్రజా ప్రతినిధి ఆలోచిస్తాడు. ప్రస్తుత ప్రజాప్రతినిధులలో తహతహ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇలా ఓట్లకు అమ్ముడుపోయే ప్రక్రియ ఉంటే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదకరం. ఈ రోజు రూ. ఆరు వేలు పెట్టిన వారు రేపు రూ. ఇరవై వేలు ఇచ్చి ఓట్లు కొంటారు. అందులో ఎలాంటి సందేహం ఉండదు. రాజకీయ నేతలు ఎవరూ వారి సొంత డబ్బులు పంచడం లేదు. ప్రభుత్వ పరంగా ఇచ్చే స్కీముల డబ్బులే కాదు ఓట్ల కొనుగోలుకు ఇచ్చే డబ్బులు కూడా వారి కష్టార్జితం కాదు. అదంతా ప్రజల సొమ్ము దోపిడి చేసిందే. ఈ విషయం ప్రజలకు తెలుసు. కానీ ఏ ఒక్క ప్రజలు కూడా తిరగబడి ప్రశ్నించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అక్కడ పంచే వారు ఒకరిద్దరు కాదు..అందరూ. ఎవర్ని నిలదీస్తారు. నిలదీస్తే వచ్చే ప్రయోజనం ఏముంది..? అన్న భావన వస్తోంది.
నిఖార్సైన చైతన్యం వస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ !
" ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది " అని మనం ఇప్పటి వరకూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ చైతన్యం రావాల్సిన కోణంలో కాక ఎవరూ ఊహించిన విధంగా వస్తోంది. ఫలితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. దానికి సాక్ష్యం తెలంగాణలో జరుగుతున్న హుజురాబాద్ ఉపఎన్నికనే. ఒక్క ఓటుకు రూ. ఆరు నుంచి రూ. పది వేలు పంచుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎంత కస్ట్‌లీగా మారిపోయిందో... ప్రజాస్వామ్యం అంటే కొనుగోలు స్వామ్యంగా ఎలా మారిపోయిందో అంచనా వేయడం పెద్ద కష్టం కాదు. ఈ చైతన్యంలో మార్పు వస్తేనే ప్రయోజనం. లేకపోతే ప్రపంచంలో ఓట్లు కొనుగోలు చేసుకునే ప్రజాస్వామ్యంగా భారత్ ఒక్కటే నిలబడుతుంది. దానికి బనానా రిపబ్లిక్ అని పేరు పెట్టినా బత్తాయి రిపబ్లిక్ అని పేరు పెట్టినా మనకు తలవంపులే..!
Also Read : నిన్న నాగార్జున.. ఇవాళ దిల్ రాజు బృందం ! ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చర్చలే చర్చలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి