(Source: Poll of Polls)
Harish Rao: ఆడ రాక పాత గజ్జెలు అనే సామెత గుర్తొస్తుంది: కాంగ్రెస్ పాలనపై హరీష్ ఫైర్
Telangana News: కేవలం 5 నెలల పరిపాలన కాలంలోనే తెలంగాణలో విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ నాశనం చేసిందని, కానీ రేవంత్ రెడ్డి విద్యుత్ ఉద్యోగులు, ప్రతిపక్షాలను తప్పుపట్టడంపై హరీష్ రావు మండిపడ్డారు.
Harish Rao slams Telangana CM Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలపై తమ సర్కార్ వైఫల్యాలను అంగీకరించకుండా, విద్యుత్ ఉద్యోగులు, ప్రతిపక్షాలపై అభాండాలు మోపడాన్ని ఖండించారు. రేవంత్ వైఖరి చూస్తే ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తుకు తెస్తుందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిందన్నారు. కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపామన్నారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 నెలల్లోనే ఆ వ్యవస్థను కుప్ప కూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన విద్యుత్ సరఫరా చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అయితే వారి చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై నిరాధార ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, రాష్ట్ర పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని’ హరీష్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనాన్ని విద్యుత్ ఉద్యోగులపై నెడుతున్నారు తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డిక లేకపోవడం దురదృష్టకరం అన్నారు. సీఎం అయి ఉండి రేవంత్ రెడ్డి ఇలాంటి చేష్టలు మానుకుని కేసీఆర్ హయాంలో ఇచ్చినట్లుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదన్నారు. అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం రేవంత్ రెడ్డి భ్రమల్లో ఉన్నారని, ఇకనైనా ఉద్యోగులు, ప్రతిపక్షాలను బాధ్యల్ని చేయడం మానేసి అత్యుత్తమ పాలన అందించడంపై దృష్టి పెడితే మంచిదని సూచించారు.