RS Praveen Kumar: నీలి తెలంగాణగా మారాలి.. 8న ఆ పార్టీలో చేరిక..: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
1995 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్.. ఆగస్టు 8న యూపీ కేంద్రంగా కొనసాగుతున్న బహుజన సమాజ్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్ మాయవతి గతంలోనే ప్రకటించారు.
తెలంగాణలో గురుకులాలకు కార్యదర్శిగా తనదైన ముద్ర వేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చింది. కొద్ది వారాల క్రితం ఆయన ఉన్నట్టుండి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. తొలుత టీఆర్ఎస్‌లో చేరుతారని, కొత్త పార్టీ పెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతి జిల్లా పర్యటిస్తూ వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ స్పష్టత ఇచ్చారు.
1995 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్.. ఆగస్టు 8న యూపీకి చెందిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్ మాయవతి గతంలోనే ప్రకటించారు. తాజాగా ప్రవీణ్ కుమార్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన తాను బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యే కావాలనో, మంత్రి కావాలనో తాను బీఎస్పీలో చేరడం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ రంగు మారాలి
గులాబీ తెలంగాణ నీలి తెలంగాణగా మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆగస్టు 8న నల్గొండ జిల్లాలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రభాకర్ కూడా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరనున్నారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. ఆయన చేరిక కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం నల్గొండ నగరంలోని ఎన్జీ కళాశాల మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతున్నారని ప్రభాకర్ తెలిపారు.
హుజూరాబాద్ టికెట్ అంటూ తొలుత ప్రచారం
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా రాజీనామా చేయగానే, ఆయన ముందుగా టీఆర్ఎస్‌లో చేరతారని విపరీతమైన ప్రచారం వచ్చింది. హుజూరాబాద్ టికెట్ ఆయనకే అంటూ ఊహాగానాలు వచ్చాయి. ఎస్సీలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేస్తారనే విపరీతమైన ప్రచారం జరిగింది. అంతేకాక, సొంత పార్టీ ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇవన్నీ కాదని తేలిపోయింది.
Also Read: Gold-Silver Price: దిగొచ్చిన పసిడి ధర, అదే దారిలో వెండి పయనం.. ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ రేట్లు ఇలా..