Huzurabad News: మామ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నావ్.. ఎన్ని చేసినా కేసీఆర్ నిన్ను నమ్మరు.. హరీశ్‌పై ఈటల కౌంటర్ అటాక్
హరీశ్ రావు హుజూరాబాద్ పర్యటన సందర్భంగా ఈటల రాజేందర్‌ను ఎద్దేవా చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. దానికి తాజాగా ఈటల గట్టి కౌంటర్ ఇచ్చారు.
హుజూరాబాద్‌లో మంత్రి హరీశ్ రావు-ఈటల రాజేందర్ మధ్య మాటల వేడి కొనసాగుతోంది. బుధవారం హరీశ్ రావు హుజూరాబాద్ పర్యటన సందర్భంగా ఈటల రాజేందర్‌ను ఎద్దేవా చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. దానికి తాజాగా ఈటల గట్టి కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావుకు తనకు మధ్య 18 సంవత్సరాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన అవన్నీ మర్చిపోయి తన మామ కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేద్దామని అనవసరంగా తనపై అభాండాలు వేస్తున్నాడని అన్నారు. హరీశ్ రావు ఎంత పని చేసినా.. తన మామ కేసీఆర్ ఆయన్ను నమ్మబోరని కొట్టిపారేశారు. ఎప్పటికైనా టీఆర్ఎస్‌ను సొంతం చేసుకోవాలని హరీశ్ రావు అనుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు చేతికి పార్టీ వచ్చేలోపే టీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుందని వ్యాఖ్యానించారు. జమ్మికుంటలో గురువారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
హుజూరాబాద్ కోసం హైదరాబాద్ భూములు
హుజూరాబాద్‌ను తానే తన శాయశక్తులా అభివృద్ధి చేశానని ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్‌లో పెద్దగా పెండింగ్ పనులు లేవని అన్నారు. గుత్తేదార్లు చేసిన పనులకు చాలా మందికి బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. ‘‘రైతు బంధు తెలంగాణ మొత్తం అమలు చేసి.. దళిత బంధును హుజూరాబాద్‌లోనే ఎందుకు అమలు చేస్తున్నారు? నాకు ఓటేస్తే పథకాల నుంచి పేర్లను తొలగిస్తాం అని ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు.. దుబ్బాకలో అలాగే చేయలేదు కదా.. హుజూరాబాద్‌లో డబ్బులు పంచడానికి హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు అమ్మారు. కోకాపేట భూముల కథ అందుకే.’’ అని ఈటల ఆరోపణలు చేశారు.
గెలుపు నాదే: ఈటల
తాను ఇక్కడ హుజూరాబాద్ ప్రజల ప్రేమను పొంది అప్రతిహాసంగా గెలుస్తున్న వ్యక్తినని చెప్పుకున్నారు. తన ఆస్తులపై విచారణ జరుపుకోవచ్చని.. అలాగే మీ ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరి సంపాదన ఏంతో తేలిపోతుందని సవాలు విసిరారు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, సిద్ధాంతపరమైన విమర్శలు చేయాలని అన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని ఈటల రాజేందర్ కొట్టిపారేశారు.
కేసీఆర్ గుండెలపై తన్నారు ఈటల: హరీశ్
బుధవారం ఈటల గురించి హరీశ్ రావు మాట్లాడుతూ.. బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవన్నీ గలీజు పనులని ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం అని పదే పదే మాట్లాడుతున్న ఈటల ఏ ముఖం పెట్టుకొని బీజేపీలో చేరారని ప్రశ్నించారు. ప్రజలకు గడియారాలు పంచినప్పుడే ఆత్మగౌరవం ఖతమైపోయిందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బుధవారం మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ‘‘తండ్రి లాంటి కేసీఆర్‌ను, తల్లి లాంటి టీఆర్ఎస్‌ను ఈటల గుండెల మీద తన్ని వెళ్లాడు. టీఆర్ఎస్ లేక ముందు ఈటల రాజేందర్ పేరు కూడా ఎవరికీ తెలియదు.’’ అని హరీశ్ రావు అన్నారు.