Gutta Sukender: విలీనం, విమోచనం అంటే అర్థం తెలియనోళ్లూ మాట్లాడుతున్నారు - గుత్తా సుఖేందర్
Gutta Sukender: విలీనం, విమోచనం గురించి తెలియని వాళ్లు కూడా వాటి గురించి మాట్లాడుతూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుకుంటున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Gutta Sukender: కొంతమంది విలీనం, విమోచనం అర్థం తెలియకుండానే మాట్లాడేస్తున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఏమీ తెలియకుండా తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శాసన మండలి థఐప్మన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పారు. ఆనాడు పోరాటంలో అసువులు బాసిన వారికి ఆయన జోహార్లు తెలిపారు.
ఏం తెల్వదు.. ఎట్ల పడితే అట్ల మాట్లాడుతరు!
"రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్లు కూడా వాళ్ల పరిధిని మించి.. తెలంగాణ అంటే ఏందో తెల్వదు, తెలంగాణ ఉద్యమం గురించి తెల్వదు. తెలంగాణ ఏ విధంగా ఉన్నదో కూడా తెల్వనటువంటి వాళ్లు కూడా, దీని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచనా విధానాన్ని ప్రజలను మభ్య పెట్టే విధంగా మాట్లాడడం సరైనటువంటిది కాదు. రాష్ట్ర గవర్నర్ గారు కూడా.. ఆమె విమోచన దినం అనే కచ్చితంగా చెప్తా ఉంది. విమోచనమా, విలీనమా పార్టీ యూనియన్ లో కలిసిపోవడమా.. ఆనాటి పోరాట యోధులు, తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. కానీ ఆమె ఏ పార్టీకి అయితే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నదో, ఆమె ఆ పార్టీ భావజాలాన్నే గవర్నర్ గా వ్యక్తీకరిస్తున్నట్లుగా మనకు అర్థం అవుతా ఉంది. అది సరైనటువంటి పద్ధతి కాదని నేను చెబుతా ఉన్న. మనకు ఉన్నటువంటి పరిధిలోనే మనం వ్యవహరించాలని నేను భావిస్తా ఉన్న. ఏ రాజ్యాంగ వ్యవస్థను అయినా కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవస్థలకు ఉన్నటువంటి అధినేతలే దానికి కారకులు. బాధ్యులు కూడా. ఆ వ్యవస్థకు పని చేస్తున్న వ్యక్తులు చట్ట బద్ధంగా, న్యాయంగా ఆ పనులు చేయాలి. పార్టీలకు అతీతంగా, వ్యక్తిగత భావా జాలానికి దూరంగా ఉండి విధులు నిర్వహించాలి." - గుత్తా సుఖేందర్
రాష్ట్ర గవర్నర్ కూడా విలీనం అనడం విడ్డూరంగా ఉంది..
బాధ్యత లేకుండా కొంత మంది విలీనం, విమోచనం అంటూ భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమైన చర్యగా భావించారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియని వాళ్లు కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర గవర్నర్ సైతం విమోచనం దినం అని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమె పని చేసిన తన పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తున్నారని ఆరోహించారు. కేంద్రం హైదరబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహించడం సరికాదన్నారు. బీజేపీ వాళ్లకు ఏం అవసరం అని ప్రశ్నించారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థకి విఘాతం కలిగిస్తుందని గుత్తా సుఖేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తూ... రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.