Komatireddy Venkat Reddy : వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశారు.
Komatireddy Venkat Reddy : వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించేశారు. నల్గొండ అంటే ప్రాణం అంటూ వచ్చే ఎన్నికలో ఇక్కడి నుంచి పోటీ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి.. భువనగిరి ఎంపీగా ఉన్నాయి. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో పోటీ చేస్తానని కోమటిరెడ్డి చెప్పడంతో... ఉత్తమ్ ఎలా స్పందిస్తారో అని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నెల 28న నల్గొండలో జరిగే నిరుద్యోగ నిరసన సభలో పాల్గొంటానని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తనను సంపద్రించకుండా నిరసన సభ పెడితే అంత ఎత్తున ఎగిరిపడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఇప్పుడు ఏకంగా ఆయన సీటుకే ఎసరుపెట్టడంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
నల్గొండ నుంచి పోటీ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను సంప్రదించకుండా నల్గొండలో నిరుద్యోగ నిరసన దీక్షను చేపట్టారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసి నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేయించారు. దీంతో ఏప్రిల్ 21న నల్గొండలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన దీక్షను టీపీసీసీ వాయిదా వేసింది. దీనిపై ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టిన నిరుద్యోగ నిరసన సభను సమిష్టిగా నిర్వహించాలని సూచించారు. ఆ మేరకు ఏప్రిల్ 28న నల్గొండలో నిరసన దీక్షను నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం ఓకే చెప్పింది. అయితే ఈ సభలో పాల్గొంటానని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించడం నల్గొండ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. అసలైన కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ మధ్య జరుగుతున్న వార్ ను కోమటిరెడ్డి ఇప్పుడు మరో అంకానికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇద్దరు సీనియర్ల మధ్య వార్ నడుస్తుందా? లేక ముందే మాట్లాడుకుని ప్రకటించేశారా? అని చర్చ జరుగుతోంది.
నిరుద్యోగ నిరసన సభపై సమాచారంలేదు
రేవంత్ రెడ్డి నల్గొండలో నిర్వహిస్తున్న నిరుద్యోగ సభ గురించి తనకు సమాచారం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జూన్ లో నల్గొండకు చేరుకుంటుందన్నారు. ఆ టైంలో నల్గొండకు ప్రియాంకా గాంధీని తీసుకొస్తానని కోమటిరెడ్డి తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కోమటిరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఆయన బీజేపీలోకి జంప్ అంటూ వార్తలు వచ్చాయి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బాటలో అన్న వెంకట్ రెడ్డి అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే అదంతా తూచ్ అని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. కావాలనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని వాటిని నమ్మొదన్నారు. ఇప్పుడు నల్గొండ నుంచి పోటీ చేస్తానని చెప్తున్న కోమటిరెడ్డికి అధిష్ఠానం నుంచి హామీ వచ్చిందా? లేక ఆయన మనసులో మాటను బయటపెట్టారా అనే చర్చ నడుస్తుంది.