Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై ఎంపీ కోెమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన అరెస్ట్ గురించి పట్టించుకునే సమయం లేదన్నారు.
![Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు congress mp komatireddy venkat reddy comment on chandrababu naidu arrest Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/99bb558d47352467f060de9222e762cc1695987191855861_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటికే తెలంగాణలోని ప్రధాన పార్టీల నేతలందరూ స్పందించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు బాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు వంటి నేతలు బాబు అరెస్ట్ అక్రమమని వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడేందుకు ఆయన పెద్దగా ఎక్కువ ఆసక్తి చూపలేదు.
చంద్రబాబు అరెస్ట్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబు కేసుల కథనాలు వస్తుంటే టీవీ ఆఫ్ చేస్తున్నానని, ఆయనకు సంబంధించిన వార్తలు న్యూస్ పేపర్లలో చదవడమే మానేశానని అన్నారు. బాబు అరెస్ట్ గురించి ఇప్పుడు మాట్లాడనని, అయినా ఆంధ్రా గురించి మాకెందుకు? అని ప్రశ్నించారు. మా దృష్టి అంతా కేసీఆర్‌ను గద్దె దించడంపైనే ఉందన్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి తాను పట్టించుకోవడం లేదని, మా బాధలు మాకున్నాయని తెలిపారు. కేసీఆర్‌ను ఎలా గద్దె దించాలనే దానిపైనే తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఏపీ రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నారు. అక్కడ ఏం జరిగినా మాకు అనవసరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మాది మాకే ఉందని, చంద్రబాబు అరెస్ట్ గురించి పట్టించుకునే సమయం లేదని తెలిపారు. తమ దృష్టంతా కేసీఆర్‌ను ఓడించాలనే విషయంపైనే కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ సర్కార్‌కు కోమటిరెడ్డి ఛాలెంజ్ విసిరారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే తాను ఎమ్మెల్యే బరిలో ఉండనని, పోటీ నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు. తన సవాల్ స్వీకరించేందుకు బీఆర్ఎస్ నుంచి ఎవరు ముందుగా వచ్చినా సిద్దమేనని అన్నారు.
అలాగే కాంగ్రెస్ రూ.10 కోట్లకు అసెంబ్లీ టికెట్లను అమ్ముకుంటుందని మంత్రి హరీష్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు తీసుకుని టికెట్లు ఇచ్చే అలవాటు కాంగ్రెస్‌కు అసలు లేదని, టికెట్ల అంశంపై అధిష్టానంతోనే మాట్లాడుకుంటానని అన్నారు. దళితబంధు, బీసీ బంధు కోసం మీ పార్టీ నేతలు ఎంత కమీషన్లు తీసుకున్నారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. హరీష్ రావు ఆరడుగుల హైట్ ఉంటే సరిపోదని, ముందు మీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. హరీష్ రావుకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. నిరూపించకపోతే హరీష్ రావు రాజీనామా చేస్తారా? అంటూ మండిపడ్డారు. విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నా లేనట్లేనని, విద్యుత్ సమస్యలపై మంత్రులు కేటీఆర్, హరీష్ సమీక్ష చేయాలని సూచించారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా జరగడం లేదని, కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని వెంకటరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని, 75 నుంచి 85 సీట్లలో గెలుస్తామని వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)