(Source: ECI/ABP News/ABP Majha)
MLA Jagga Reddy: నేను కోవర్ట్ అయితే.. రేవంత్ కూడా కోవర్టే.. టీఆర్ఎస్ లోకి వెళ్లాలనుకుంటే ఎవరూ ఆపలేరు
మంత్రి కేటీఆర్ కు కోవర్ట్ అంటూ.. తనపై వస్తున్న ప్రచారంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. కావాలనే కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు.
మంత్రి కేటీఆర్ కు కోవర్ట్ అంటూ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ తయారైందని విమర్శించారు. వాళ్లే పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి కోవర్ట్ అంటూ ప్రచారం చేయడం కరెక్టు కాదన్నారు. టీఆర్ఎస్‌లోకి వెళ్లాలనే ఆలోచన ఉంటే.. ఎవరూ ఆపలేరని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమం జరిగిందని జగ్గారెడ్డి తెలిపారు. ఆ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అయితే తన నియోజకవర్గ అభివృద్ధి గురించి.. మాట్లాడితే.. కొంతమంది కావాలానే.. కోవర్ట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ అధికార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా సఖ్యతతో మెలగాల్సిందే కదా అని అన్నారు.
మంత్రులు నియోజకవర్గానికి వస్తే.. నిధులు అడగకూడదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ ఒకటి తయారైందని, టీఆర్ఎస్ పార్టీలోకి పోవాలంటే నేరుగా వెళ్తానని తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. పీసీసీలో నచ్చని అంశాలను సరిచేసుకోవాలని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను చాలా విషయాల్లో వ్యతిరేకించినా.. పార్టీ మారుతున్నానని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను కోవర్ట్ అయితే.. రేవంత్ కూడా కోవర్టే అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
'కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్‌లోనే జీవిస్తాను. అధికారిక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నా నియోజవర్గానికి నిధులు కావాలని వినతి పత్రం ఇచ్చాను. ఏ పార్టీలో ఉన్నా అధికారిక కార్యక్రమంలో కలవడం మామూలే. పార్టీలు వేరైనా ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం సంస్కారం. దీనిపై కూడా పిచ్చి అభిమాన సంఘాలు రాద్ధాంతం చేస్తున్నాయి.' అని జగ్గారెడ్డి అన్నారు.
Also Read: KTR: మేం అన్నీ ఇస్తాం.. ఆ పరిశ్రమ తెరిపించండి, దాంతో ఎన్నో లాభాలు.. కేంద్రానికి కేటీఆర్ లేఖ
Also Read: WB Covid Curb: ఆంక్షల వలయంలో రాష్ట్రాలు.. అక్కడ విద్యాసంస్థలు బంద్, వర్క్ ఫ్రమ్ హోం అమలు
Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు