LB Nagar Youth Fight: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
ఎల్బీనగర్ లో మద్యం, గంజాయి మత్తులో యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మరణించగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్ ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి ఇరువర్గాలకు చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గంజాయి, మద్యం మత్తులో యువకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రాడ్లు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో నరసింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నరసింహారెడ్డి మృతికి కారణమైన యువకుల నివాసంపై అతని బంధువులు దాడికి యత్నించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో దాడులు
ఎల్బీనగర్‌లో డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి ఎల్బీ నగర్ కేకే గార్డెన్స్ వద్ద ఖాళీ ప్రదేశంలో యువకులు మద్యం తాగుతున్నప్పుడు ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. దాడికి పాల్పడిన యువకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: ఖమ్మంలో స్నేహితుడి దారుణం.. కత్తితో విచక్షణారహితంగా దాడి, కారణం తెలిస్తే షాక్..!
మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి
మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసైన యువకులు క్షణికావేశంలో చేస్తున్న పనులు వారి జీవితాలను ఆగం చేస్తున్నాయి. మత్తులో ఉన్న వారు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా స్నేహితులను సైతం కడతేర్చేందుకు వెనుకాడం లేదు. ఇలాంటి సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య రూ.500ల విషయంలో వచ్చిన గొడవ చివరకు కత్తి పోట్ల వరకు దారి తీసింది. అప్పటికే మత్తులో ఉన్న వీరు విచక్షణ మరిచారు. తాను గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమనగానే ఆవేశంలో కత్తితో దాడి చేసిన సంఘటన ఖమ్మం నగరంలోని బీకే బజార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం బీకే బజార్‌కు చెందిన వల్లోజి నాగరాజు, జూబ్లీపూర ప్రాంతానికి చెందిన ముత్తినేని భాస్కర్‌లు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు చెడు వ్యసనాలకు బానిసై జులాయిగా తిరుగుతున్నారు. అయితే కొద్ది రోజుల కిందట బాస్కర్, నాగరాజు వద్ద రూ.500లు అప్పుగా తీసుకున్నాడు. బీకేబజార్‌లో బాస్కర్ మటన్ కొనుగోలు చేసుకునేందుకు రావడంతో అతనిని చూసిన నాగరాజు తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడు.
Also Read: న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగిలించిన పోలీస్.. చివరకు ఏమైందంటే..
భాస్కర్ తన వద్ద లేవని చెప్పడంతో అతని వద్ద జేబులో నుంచి బలవంతంగా డబ్బులు గుంజుకునేందుకు నాగరాజు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైంది. వీరిద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. అప్పటికే మత్తులో ఉన్న భాస్కర్ విచక్షణ కోల్పోయి మటన్ షాపులో ఉన్న కత్తి తీసుకుని నాగరాజుపై దాడి చేశాడు. పలుమార్లు కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో తీవ్రగాయాలతో పడిపోయిన నాగరాజును స్థానికులు 108 ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ సీఐ చిట్టిబాబు, ఎస్‌ఐ వీరబాబులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Also Read: నెల్లూరులో కారు దగ్ధమైన ఘటన.. వెలుగులోకి మరిన్ని విషయాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి