Crime News: ఖమ్మంలో స్నేహితుడి దారుణం.. కత్తితో విచక్షణారహితంగా దాడి, కారణం తెలిస్తే షాక్..!
మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసైన యువకులు క్షణికావేశంలో చేస్తున్న పనులు వారి జీవితాలను ఆగం చేస్తున్నాయి. మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా స్నేహితులను సైతం కడతేర్చేందుకు వెనుకంజ వేయడం లేదు.
మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసైన యువకులు క్షణికావేశంలో చేస్తున్న పనులు వారి జీవితాలను ఆగం చేస్తున్నాయి. మత్తులో ఉన్న వారు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా స్నేహితులను సైతం కడతేర్చేందుకు వెనుకాడం లేదు. ఇలాంటి సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య రూ.500ల విషయంలో వచ్చిన గొడవ చివరకు కత్తి పోట్ల వరకు దారి తీసింది. అప్పటికే మత్తులో ఉన్న వీరు విచక్షణ మరిచారు. తాను గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమనగానే ఆవేశంలో కత్తితో దాడి చేసిన సంఘటన ఖమ్మం నగరంలోని బీకే బజార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఖమ్మం బీకే బజార్‌కు చెందిన వల్లోజి నాగరాజు, జూబ్లీపూర ప్రాంతానికి చెందిన ముత్తినేని భాస్కర్‌లు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు చెడు వ్యసనాలకు బానిసై జులాయిగా తిరుగుతున్నారు. అయితే కొద్ది రోజుల కిందట బాస్కర్, నాగరాజు వద్ద రూ.500లు అప్పుగా తీసుకున్నాడు. బీకేబజార్‌లో బాస్కర్ మటన్ కొనుగోలు చేసుకునేందుకు రావడంతో అతనిని చూసిన నాగరాజు తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడు.
భాస్కర్ తన వద్ద లేవని చెప్పడంతో అతని వద్ద జేబులో నుంచి బలవంతంగా డబ్బులు గుంజుకునేందుకు నాగరాజు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైంది. వీరిద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. అప్పటికే మత్తులో ఉన్న భాస్కర్ విచక్షణ కోల్పోయి మటన్ షాపులో ఉన్న కత్తి తీసుకుని నాగరాజుపై దాడి చేశాడు. పలుమార్లు కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో తీవ్రగాయాలతో పడిపోయిన నాగరాజును స్థానికులు 108 ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ సీఐ చిట్టిబాబు, ఎస్‌ఐ వీరబాబులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
మత్తులో వరుసగా అల్లర్లు..
గంజాయి, మద్యం మత్తులో అల్లరి చిల్లరగా తిరిగే నాగరాజు, భాస్కర్‌లు పలుమార్లు రోడ్డుపైనే గొడవ పడేవారని, ఒక్కోసారి బ్లేడ్లతో కోసుకునేవారని స్థానికులు చెబుతున్నారు. మత్తులో ఉండగా అటువైపు ఎవరైనా స్థానికులు వెళితే వారిపై బెదిరింపులకు పాల్పడేవారని స్థానికులు తెలిపారు. గంజాయి, మద్యం మత్తులో ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు గంజాయి సేవించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ వారిపై కేసులు నమోదు చేస్తునప్పటికీ జులాయిగా తిరిగే వారు మాత్రం మత్తులో తూగుతూ నగరంలో అల్లర్లకు పాల్పడుతూనే ఉన్నారు. దీని వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు జులాయిలపై ప్రత్యేక నిఘా వేసి ఇలాంటి వారి ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Petrol Price 31 December 2021: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు..
Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర.. రూ.800 తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!