Indiramma Housing Scheme: 'పేదల కలలపై కేసీఆర్ ఓట్ల వ్యాపారం' - మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభంలో సీఎం రేవంత్
Telangana News: ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఆ ఇల్లు బాగుంటుందని.. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని సీఎం రేవంత్ తెలిపారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారు.
![Indiramma Housing Scheme: 'పేదల కలలపై కేసీఆర్ ఓట్ల వ్యాపారం' - మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభంలో సీఎం రేవంత్ cm revanth reddy inaugurated indiramma housing scheme Indiramma Housing Scheme: 'పేదల కలలపై కేసీఆర్ ఓట్ల వ్యాపారం' - మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభంలో సీఎం రేవంత్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/a052548e5b53233a78e913e9c5613f461710149974153876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Revanth Inaugurated Indiramma Housing Scheme: బడుగు వర్గాల ఆత్మ గౌరవమే ఇందిరమ్మ ఇళ్లని.. పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. భద్రాచలంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) సోమవారం ఆయన ప్రారంభించారు. భద్రాచలం స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని పథకం ప్రారంభించానని.. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని.. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. అంతకు ముందు సీఎం రేవంత్ భద్రాచలం సీతారాముని ఆలయానికి వెళ్లారు. ఆలయ ఈవో, వేద పండితులు పూర్ణ కుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు.
కేసీఆర్ కు సవాల్
భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాంమని.. పదేళ్లు చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్పి తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్ పాలనను బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఏ ఊరిలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో ఆ ఊర్లోనే ఆయన ఓట్లు అడగాలని.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులను బలి తీసుకున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. 'ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కు ఓ బలమైన బంధం ఉంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాం. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.' అని రేవంత్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజల బాధ చూసే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 'ఇచ్చిన హమీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నాం. సొంతింటి కల సాకారం కోసం ప్రజలు పదేళ్లుగా ఎదురు చూశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకూ పట్టాలు ఇస్తాం. భద్రాచలం అభివృద్ధికి మా వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉంది.' అని భట్టి పేర్కొన్నారు.
'రామయ్యను కేసీఆర్ మోసం చేశారు'
అటు, భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని.. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని.. పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేస్తే.. తాము పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)