Telangana CM Revanth Reddy: యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు- పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Yadagiri Gutta News: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Yadadri News: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు పూజల్లో పాల్గొన్నారు. తొలిసారిగా సీఎం హోదాలో గుట్టకు వచ్చిన రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుల వేదాశీర్వచాలు తీసుకున్నారు. వారికి వేద పండితులు ప్రత్యేక తీర్థప్రసాదాలు అందించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన తొలి రోజు వేడుకలో సీఎం రేవత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పూజల్లో పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టకు వస్తున్న వేళ భారీగా కాంగ్రెస్ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు తోపులాట జరిగింది. కొందరు కాంగ్రెస్ నేతలను గుడి వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుకు నిరసనగా వారంతా ధర్నా చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి సర్దిచెప్పడంతో వారంతా శాంతించి ఆందోళన విరమించారు.