TS Politics : కేంద్రం చెప్పేసింది ! ఇక రాజకీయాలు పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచిస్తారా ?
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం క్లారిటీగా చెప్పింది. ఇప్పటి వరకూ రైతుల్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న రాజకీయాన్ని ఆపి వారి మేలు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది.
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై ఎక్కడా లేనంత రాజకీయం జరుగుతోంది. కేంద్ర , రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ధర్నాలు, దాడులు చేస్తున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఇందిపార్క్ వద్ద ధర్నా చేశారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ధాన్యాన్ని కేంద్రం తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. వచ్చే సీజన్‌లో కూడా పరిమితంగానే కొంటామని ఎంత కొంటామన్నది రాష్ట్ర ప్రభుత్వాలతో త్వరలో జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. వరి కన్నా ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలని తేల్చేసింది. దీంతో ఇప్పుడు రైతా ? రాజకీయమా తేల్చుకోవాల్సిన పరిస్థితి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలపైన పడింది.
తెలంగాణలో వరి రైతుల గోస!
తెలంగాణలో వరి పండించిన రైతులు అమ్ముకోలేక వేదనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ప్రాణాలు ధాన్యం కళ్లాల్లోనే పోతున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని కేంద్రంలోఅధికారంలో ఉన్న బీజేపీ నేతలు ధర్నాలు చేశారు. వారికి పోటీగా రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కూడా కేంద్రం వడ్లు కొనడం లేదని ధర్నాలు చేశారు. అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం.. ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పోటాపోటీగా ధర్నాలు చేసేశారు. దాడులు కూడా చేసుకున్నారు. అంటే ఓ రకంగా ఇద్దరూ తమది కాదు బాధ్యత.. ఎదుటి వాడిది అని చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు రైతుకు దిక్కెవరు ?
Also Read: కేంద్ర ప్రభుత్వాన్ని సాఫ్ సీదా అడుగుతున్నం.. వడ్లు కొంటరా? కొనరా?.. కేసీఆర్ సూటి ప్రశ్న
రాజకీయం బిజీలో అధికార పార్టీలు !
గతంలో వ్యవసాయ చట్టాలకు మద్దతుగా నిలిచి ఇక కొనబోమని తెలంగాణ సీఎం చెప్పారు. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో పంట మొత్తం చివరి గింజ వరకూ రాష్ట్రమే కొంటుందని కేసీఆర్ ప్రకటించారు. కేంద్రానికేం సంబంధం లేదన్నారు. ఇప్పుడు అదే మాటల్ని పట్టుకుని బీజేపీ నేతలు ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. కొనేది రాష్ట్రమే అయినా అసలు సేకరించాల్సింది కేంద్రమని ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ వాదిస్తోంది. దీంతో సమస్య జఠిలమయింది. కేంద్రంలో అధికార పార్టీ, రాష్ట్రంలోని అధికార పార్టీ పరస్పరం పోరాడుతున్నాయి. కానీ రైతుల సమస్యలకు పరిష్కారం చూపేలా ఆ పోరాటం లేదు. ఒకరిపై ఒకరు నిందలేసుకునేలా ఉంది.
Also Read: ఈ యుద్ధం ఆరంభమే.. అంతం కాదు, ఇక ఉప్పెనలాగా.. అవసరమైతే వాళ్లనీ కలుపుకుపోతాం: కేసీఆర్
రైతుల పేరుతో రెండు పార్టీలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయా ?
రాజకీయాల్లో ఇద్దరి మధ్యనే పోటీ జరుగుతోంది అన్న ఫీలింగ్ తీసుకు వస్తే.. దూరంగా ఉన్న మూడో పార్టీని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ పార్టీ ఓటర్లు కూడా ఓడిపోయే పార్టీకి ఓటెందుకు వేయడం అని.. ఓడించాలనుకున్న పార్టీకి ఓట్లేస్తున్నారు. హుజురాబాద్, దుబ్బాకల్లో అదే తేలింది. అక్కడ జరిగిన రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. అందుకే కాంగ్రెస్ పార్టీని ఓటర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు అదే రాజకీయాన్ని రైతుల పేరుతో ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నట్లుగా అనుమానించే పరిస్థితి ఏర్పడింది. కాదు.. రైతుల కోసమే తమ రాజకీయం అని చెప్పాలనుకుంటే ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చింది దానికి వేరే అర్థాలు తీయకుండా సమస్యను రైతులకు మేలు జరిగేలా పరిష్కరించాల్సి ఉంది.
Also Read: బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోం... ఆ కారణంతోనే పంజాబ్ లో కొంటున్నాం... ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టత
కేంద్రం ప్రకటనకు భిన్నాభిప్రాయాలు చెబితే రైతులను మోసం చేయడమే !
కేంద్రం బియ్యం తీసుకోనని స్పష్టంగా చెప్పింది. బాయిల్డ్ రైస్ అనే పదం వాడింది కాబట్టి సన్న రకం వడ్లు కొంటుందని ఎవరైనా ప్రచారం చేస్తే అది రైతుల్ని మోసం చేయడమే. ఇది ాజకీయం చేయదగ్గ అంశం కాదు. రైతుల భవిష్యత్‌తో కూడిన అంశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో వరి సాగు రెట్టింపు అయింది. 2014-15లో కేవలం వరి సాగు 34.96 లక్షల ఎకరాల్లో మాత్రమే ఉండేది. 2019-20వో ఇది 68.50 లక్షల ఎకరాలకు చేరింది. అంటే రెట్టింపు అయింది. వరిధాన్యం దిగుబడి కోటిన్నర టన్నులకు చేరింది. ఖరీఫ్, రబీ సీజన్లు అనే తేడా లేకుండా.. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని వరి పంట కనిపిస్తోంది. ఏదైనా డిమాండ్ సప్లయ్ సూత్రాన్ని పాటించాలి. లేకపోతే పండించే రైతులకే ఇబ్బందులు వస్తాయి.
Also Read : మెుత్తం ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలి.. గవర్నర్ కు టీఆర్ఎస్ వినతిపత్రం
రాజకీయం మానేసి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సాహించాలి !
కేంద్రం కూడా సరిపడా ధాన్యం ఉందని అంటోంది. ఇలాంటి సమయంలో రైతుల్ని జాగృతం చేయాలి. వరి సాగు పెరగడంతో ఇతర వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది. వీటిని పెంచాల్సి ఉంది. అనుకూలమైన పంటలను పండించేలా రైతుల్ని ప్రోత్సాహించాల్సి ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏ రాజకీయం అయినా ప్రజల మేలు కొరకే ఉండాలి. రైతుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచిస్తాయని ఆశిద్దాం...!
Also Read : నిర్మల్ కలెక్టర్ పెద్దమనసు.. మంత్రి కేటీఆర్ ప్రశంసలు, స్థానికులు కూడా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి