Rakesh Reddy: జీవో 46పై స్టే ఎత్తేసి, నిరుద్యోగులకు న్యాయం చేయండి, ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
Rakesh Reddy on GO 46 : జీవో 46 బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపాలని రాకేశ్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
Rakesh Reddy: జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపాలని రాకేశ్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితులకు ప్రభుత్వం కావాలనే అన్యాయం చేస్తుందని ఆరోపించారు. అమాయక యువతను మోసం చేస్తుందన్నారు. బాధితులతో ప్రభుత్వం బంతి ఆట ఆడుతుందన్నారు. దాదాపు 20 సార్లకు పైగా కోర్టులో వాదనలు వాయిదా పడటం అంతా ప్రభుత్వ పుణ్యమే అన్నారు. జీవో 46 బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా జరిపేందుకు కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 46 తీసుకొచ్చింది. ఈ జీవోపై స్టేను తక్షణమే ఎత్తివేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యోగ భర్తీలో ఎవరికీ అన్యాయం జరగకుండా తీసుకొచ్చిన జీవోపై ఎందుకు స్టే ఇచ్చారని, కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం కుట్ర చేస్తుంది
జీవో 46 బాధితుల పట్ల ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుందన్నారు రాకేష్ రెడ్డి. అడ్వకేట్ జనరల్ తో అబద్ధాలు ఆడిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ దాటవేత ధోరణిని నమ్ముకుందన్నారు. జీవో 46 పై తమ వైఖరి ఏంటో చెప్పకపోతే ప్రత్యక్ష ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం ఖాయమన్నారు. గతేడాది నుంచి తమ హక్కుల కోసం కోట్లాడుతున్న జీవో 46 బాధితులకు సంబధించిన కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ, ప్రభుత్వ తరుపు న్యాయవాది, అడ్వకేట్ జనరల్ కావాలనే ఏవో కారణాలు చెప్పి వాయిదా వేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్దెర మాటలు, నోటికి వచ్చిన హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి వాటన్నింటినీ దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికీ తప్పని కోర్టు తీర్పు వస్తుందన్నారు. కాబట్టి దాన్ని తాత్కాలికంగా తప్పించుకోవడం కోసమే ప్రభుత్వ యంత్రాంగాన్ని, శక్తియుక్తులను వాడుకుని వాయిదా వేసేలా చేస్తున్నారని విమర్శించారు.
న్యాయం జరిగే వరకు కొట్లాడుతాం
జీవో 46 పై ప్రభుత్వం వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ మా నిరసనగకు తలొగ్గి తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెట్టారని రాకేష్ రెడ్డి తెలిపారు. కానీ, ప్రభుత్వం వైపు నుండి కనీస చలనం లేదన్నారు. ముఖ్యమంత్రి నుంచి కనీస ఉలుకు పలుకు లేదన్నారు. ఈ కమిటీలో ఉన్న మంత్రులు కేవలం కీలు బొమ్మలే అన్న సంగతి ఒప్పుకోవాలని రాకేష్ రెడ్డి అన్నారు. కొన్ని వేల కుటుంబాలకు, లక్షల జీవితాలకు సంబంధించిన అంశాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోర్టులో న్యాయ ప్రక్రియకు అడ్డుపడకుండా జీవో 46 బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేయాలన్నారు.
జీవో 46 బాధితులకు రక్షణగా ఉంటూ.. న్యాయం జరిగే వరకూ కోట్లాడుతూనే ఉంటామన్నారు. చట్టసభలు స్పందించకపోతే, కోర్టులో అక్కడ కూడా సమాధానం దొరకకపోతే ప్రజా కోర్టులో కొట్లాడుతామన్నారు. కానీ, ఏదేమైనా సమస్యలకు సమాధానం దొరకే వరకు కొట్లాడడం మాత్రం పక్కా అన్ని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.