KCR Tejaswi Yadav : ప్రగతి భవన్‌కు బీహార్ ప్రతిపక్ష నేత.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కీలక చర్చలు ...
జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీల్ని ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. గతంలో స్టాలిన్, సీపీఎం నేతలతో చర్చలు జరిపిన ఆయన తాజాగా ఆర్జేడీ నేత తేజస్వితో ప్రగతి భవన్‌లో చర్చలు జరిపారు.
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే జాతీయ రాజకీయాలపై వ్యూహ రచన చేస్తున్నారు. గతంలో ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్లి పార్టీ నేతలను కలిసేవారు. ఇప్పుడు వారిని ప్రగతి భవన్‌కు ఆహ్వానిస్తున్నారు. బీహార్ ప్రతిపక్ష నేత , రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ తేజస్వి యాదవ్ ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీల్లో ఒకటి అయిన ఆర్జేడీ ప్రస్తుతానికి కాంగ్రెస్ కూటమిలో ఉంది.
Also Read: మంత్రి హరీశ్ రావును కలిసిన బాలకృష్ణ.. ఆ విషయంలో సాయం కోసం విజ్ఞప్తి
తేజస్విని ప్రత్యేకంగా కేసీఆర్ ఆహ్వానించారు. రెండు రోజుల కిందటే లెఫ్ట్ పార్టీల ముఖ్య నేతలు పినరయి విజయన్, సీతారాం ఏచూరీ ప్రగతి భవన్‌కు వచ్చారు. వారితో విందు భేటీ నిర్వహించిన కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణపై చర్చించారు. ఇప్పుడు తేజస్వియాదవ్‌ను కూడా అదే వ్యూహంతో ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ స్థాయిలోధర్డ్ ఫ్రంట్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కానీ ఇప్పుడు గుంభనంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నారా లేకపోతే.. బీజేపీకివ్యతిరేకంగా అందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు అయితే విపక్షాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. ప్రస్తుతానికి బలాలను సమకూర్చుకుంటున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: ఫ్లవరిస్టులు తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు.. బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు