KCR: చిన జీయర్ స్వామి వద్దకు సీఎం కేసీఆర్.. యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణపై చర్చ, రామానుజుల విగ్రహ పరిశీలన
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం సందర్శించారు. అక్కడి రుత్వికులు పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా సీఎంకు స్వాగతం పలికారు.
యాదాద్రి ఆలయ పున:ప్రారంభంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. ఆదివారం ఆయన ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి రుత్వికులు పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా సీఎంకు స్వాగతం పలికారు. మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శనయాగం ఏర్పాట్లు, ఆహ్వానాలతోపాటు, ఫిబ్రవరిలో జరిగే సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం పనులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మార్చిలో మహా కుంభసంప్రోక్షణ
యాదాద్రిలో మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌స్వామితో కేసీఆర్ చర్చించారు. చినజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న గర్భాలయంలోని స్వయంభువుల నిజదర్శనాలను భక్తులకు కల్పించనున్నారు.
ఫిబ్రవరిలో జీయర్ ఆశ్రమంలో జరిగే సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. రామానుజ విగ్రహావిష్కరణ, సహస్రకుండ లక్ష్మీనారాయణ యాగానికి చేయాల్సిన ఏర్పాట్లను సీఎం సమీక్షించారు. జీయర్‌స్వామి యాగశాలకు సీఎంను తీసుకెళ్లి చూపించారు. 1,035 హోమ గుండాలతో ప్రత్యేక యాగం చేస్తారని తెలిపారు. ఈ యాగం కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యితోపాటు ఇతర హోమ ద్రవ్యాలు వాడనున్నట్లుగా వివరించారు. రామానుజ సహస్రాబ్ది సంరంభం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో యాగానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. యాగానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి ఫోన్‌లో ఆదేశాలిచ్చారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నారు.
Also Read: భారీగా పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంత పెరిగిందంటే..
రూ.1,200 కోట్లతో విగ్రహం
200 ఎకరాల్లో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. దీన్ని 1,200 కోట్లతో సమతామూర్తి విగ్రహాన్ని రూపొందించారు. ఫిబ్రవరిలో 12 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. రోజుకు కోటి సార్లు నారాయణ మంత్ర పఠనం ఉంటుంది.. మొత్తం 128 యాగశాలల్లో హోమం నిర్వహిస్తారు. రెండో అంతస్తులో ఐదు అడుగుల బంగారు విగ్రహం ఉంటుంది. ఇందుకోసం 120 కిలోల బంగారాన్ని వాడారు. సహస్రాబ్ది వేడుకల కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పటికే ఆహ్వానం అందింది.