Secunderabad Railway Station: భారీగా పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంత పెరిగిందంటే..
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్లాట్ ఫాం టికెట్ ధరలు భారీగా పెంచేశారు. సంక్రాంతి పండగ కారణంగా రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రించేందుకేనని ప్రకటించారు.
దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. సంక్రాంతి పండగ కారణంగా.. రద్దీ నియంత్రించేందుకు ఫ్లాట్‌ఫాం టికెట్ రేటు పెంచినట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.50కి పెంచారు. మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి పెంచారు. పెంచిన టికెట్ ధరలు.. ఇప్పటి నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నెల 20 వరకు ధరలు కొనసాగిస్తామని పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే.
ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ వెల్లడించారు. జన సమూహం ప్లాట్‌ఫాంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకు ఛార్జీలను పెంచినట్లు చెప్పారు. కొవిడ్ నియంత్రణ దృష్ట్యా కూడా అవసరం లేకుండా.. ప్లాట్‌ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు.
ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండగ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ఆర్టీసీ. జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ ప్రత్యేక బస్సులు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పండగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు.. వసూలు చేయడంలేదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
హైదరాబాద్ ఎంజీబీస్, జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, టెలిఫోన్‌భవన్, దిల్సుఖ్నగర్ నుంచి బస్సులు నడపనున్నారు. అంతేగాకుండా.. జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో ముఖ్యమైన స్టాపుల నుంచి బస్సులు ఉండనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం.. www.tsrtconline.in వెబ్సైట్లోకి వెళ్లాలి. ప్రత్యేక బస్సులను సమన్వయం చేసేందుకు సిబ్బందిని కూడా నియమించినట్టు ఆర్టీసీ తెలిపింది. నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేటతోపాటు ముఖ్యమైన పట్టణాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ చెప్పింది. అయితే ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఏ విధమైన అదనపు అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.