Balayya Meets Harish Rao: మంత్రి హరీశ్ రావును కలిసిన బాలకృష్ణ.. ఆ విషయంలో సాయం కోసం విజ్ఞప్తి
బాలయ్య చేసిన వినతికి మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఆస్పత్రి అభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తామని హరీశ్ రావు రావు హామీ ఇచ్చినట్టు సమాచారం.
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. సోమవారం ఆయన కార్యాలయానికి వెళ్లిన బాలయ్య పుష్ప గుచ్ఛం అందించారు. అయితే, బాలకృష్ణ ఒక నటుడిగానో లేదా ఎమ్మెల్యేగానో మంత్రి హరీశ్ రావును కలవలేదు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌గా హరీశ్ రావును కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తున్న సేవలు, ఆస్పత్రి కార్యకలాపాల గురించి బాలకృష్ణ మంత్రికి వివరించారు. హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బసవతారకం ఆస్పత్రి అందించే సేవల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తగిన విధంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, బాలయ్య చేసిన వినతికి మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఆస్పత్రి అభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తామని హరీశ్ రావు రావు హామీ ఇచ్చినట్టు సమాచారం. కరోనా టైంలోనూ క్యాన్సర్ రోగులకు బసవతారకం ఆస్పత్రి అందించిన సేవలను బాలకృష్ణ మంత్రికి వివరించారు. ఏటా తన పుట్టిన రోజు వేడుకలను బాలకృష్ణ ఈ ఆస్పత్రిలో జరుపుకొనే సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ప్రతి పండుగను ఇక్కడి పేషెంట్లు, వైద్య సిబ్బందితో కలిసి జరుపుకుంటారు.
2000వ సంవత్సరంలో ప్రారంభం
పేద రోగులకు క్యాన్సర్ చికిత్స అందించడంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి మంచి పేరుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో టాప్ ఆంకాలజిస్టులతో ఇక్కడ పేదలకు సైతం అత్యంత నాణ్యమైన వైద్యం అతి తక్కువ ధరలకే అందుతోంది. నందమూరి తారకరామారావు భార్య బసవతారకం క్యాన్సర్ బారిన పడి మరణించడంతో చలించిపోయిన ఆయన పేదలకు కూడా నాణ్యమైన క్యాన్సర్ వైద్యం అందాలనే లక్ష్యంతో ఆమెకు గుర్తుగా నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ (ఎన్‌బీటీఆర్‌సీఎఫ్)ను స్థాపించారు. అనంతరం ఈ ఫౌండేషన్.. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్, అమెరికా ఆధ్వర్యంలో దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ నిపుణులు, ప్రముఖ వైద్యులతో హైదరాబాద్‌లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించారు. 2000 సంవత్సరం జూర్ 22న అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయీ చేతుల మీదుగా ఈ ఆస్పత్రిని ప్రారంభించారు.
అప్పటి నుంచి ఈ ఆస్పత్రి అతి తక్కువ ధరలకే నాణ్యమైన క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తూ వస్తోంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ (ఎన్ఏబీహెచ్), నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్), ది స్టాండర్డ్ ఫర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ నుంచి గుర్తింపు పొందింది.
Also Read: దివ్యాంగ క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం... మల్లికా హందాకు రూ.15 లక్షల ఆర్థికసాయం
Also Read: ఫ్లవరిస్టులు తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు.. బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు