Breaking News Live Telugu Updates: ఏపీకి విద్యుత్ బకాయిలు 30 రోజుల్లో చెల్లించండి, తెలంగాణకు కేంద్రం ఆదేశం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం పడుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు.
రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవిస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి.
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఆగస్టు 29న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు.
ఆగస్టు 30, 31న సైతం ఈ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. కానీ నగరంలో మోస్తరు వర్షం కురిసే అవకాశం లేదు. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 23, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదైంది. వాయువ్యం, ఉత్తర దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
ఏపీకి విద్యుత్ బకాయిలు 30 రోజుల్లో చెల్లించండి, తెలంగాణకు కేంద్రం ఆదేశం
తెలంగాణ నుంచి ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బాకాయిలు 30 రోజుల్లో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బాకాయిలను చెల్లించేలే ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఎప్పటి నుంచో కోరుతుంది.
ఎల్లుండి బిహార్ కు సీఎం కేసీఆర్, అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం
CM KCR : సీఎం కేసీఆర్ ఆగస్టు 31న బిహార్ పర్యటనకు వెళ్లనున్నారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురి జవాన్ల కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం అందించనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Peddapalli : పెద్దపల్లి సీఎం కేసీఆర్ సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సజ్జల రామకృష్ణారెడ్డితో ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణతో భేటీ అయ్యారు. గత కొద్ది కాలంగా ఆమె పార్టీపై అంసతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంపై అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడంపై ఆమె వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత కూడా ఉన్నారు.
Kakinada Chemical Blast: డ
కాకినాడలో ఓ రసాయన పరిశ్రమలో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్ పేలవడం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లోనే ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండోసారి. వారం క్రితం ప్రమాదం జరిగినా పరిశ్రమ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఫ్యాక్టరీ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.