Breaking News Live Telugu Updates: గాంధీ ఆస్పత్రిలో కేసీఆర్, మహాత్ముడి విగ్రహావిష్కరణ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
తెలంగాణ రాష్ట్రం దక్షిణ భాగాల్లో కురుస్తున్న వర్షాలు, పిడుగులు ఆంధ్ర - తెలంగాణ బార్డర్ ప్రాంతాల వైపుగా వస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరొక ద్రోణి విస్తరించిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల కాలం ముగియనుండటంతో ఈ సీజన్‌లో వీటి ప్రభావంతో చివరిసారి పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో శనివారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 3, 4 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 3 వరకు వర్ష సూచన ఉందని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం సైతం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భాగాల్లో కురుస్తున్న వర్షాలు, పిడుగులు ఆంధ్ర - తెలంగాణ బార్డర్ ప్రాంతాల వైపుగా వస్తున్నాయి.
నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షం పడని ప్రాంతాల్లో మధ్యాహ్నానికి ఉక్కపోత అధికం అవుతుంది. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖ నగరంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి, కానీ అనకాపల్లి వైపు మాత్రం విపరీతమైన పిడుగులతో భారీ వర్షాలు పడుతున్నాయి. విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఉన్నాయి. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అక్టోబర్ 3 వరకు గుంటూరు జిల్లాలో విస్తరిస్తున్న భారీ వర్షాలు, ఎన్.టీ.ఆర్. జిల్లా నందిగామ వైపుగా కురుస్తున్న భారీ వర్షాలు నేరుగా పల్నాడు జిల్లాలోని పలు భాగాల్లోకి విస్తరించాయి. బంగాళాఖాతంలో పరిస్ధితులు సరిగ్గా లేకపోయినా, ప్రకాశం జిల్లాలో కోస్తా భాగాలు ముఖ్యంగా ఒంగోలు - సింగారాయకొండ బెల్ట్ తో పాటుగా నెల్లూరు జిల్లా కోస్తా భాగాల్లో వర్షాలుంటాయి.
రాయలసీమలోనూ నేడు వర్షాలున్నాయి. నంద్యాల, కర్నూలు జిల్లా సహా సీమ జిల్లాల్లో పిడుగులే పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన ఉంది. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.
Indrakeeladri Vijayawada: ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భక్తులు
ఇంద్రకీలాద్రి జనకీలాద్రిగా మారింది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో భక్తజనం పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే చదువుల తల్లిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. వీఐపీలు కూడా అధిక సంఖ్యలో వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. జై దుర్గా జైజై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనించింది. అర్ధరాత్రి నుంచే అన్ని క్యూ మార్గాల్లో భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం వేచిఉన్నారు. రాత్రి ఒంటి గంటన్నరకు దుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలుత ఈవో భ్రమరాంబ. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు ప్రథమ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, తదితరులు దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల వరకు వివిధ కంపార్టమెంట్లలో వేలాది మంది భక్తులను ఉంచి విడతల వారీగా పోలీసులు దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది వివిధ శాఖల సమన్వయంతో అధికారులు తీసుకున్న చర్యలతో భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామని పలువురు భక్తులు తెలిపారు. అన్ని క్యూ మార్గాల్లో ఉచితంగా పంపడం భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకొనే అవకాశం ఏర్పడింది. 10 గంటల నుంచి కూడా భక్తుల సంఖ్య మళ్లీ క్రమేణా పెరిగింది.
Gandhi Statue in Hyderabad: గాంధీ స్ఫూర్తితోనే పని చేసిన ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు - కేసీఆర్
గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కేసీఆర్ ప్రశంసించారు. కరోనా సమయంలో ధైర్యంగా పని చేసిన సంస్థ గాంధీ ఆస్పత్రి అని గుర్తు చేశారు. ఇక్కడి సిబ్బంది అందరూ గాంధీ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని కరోనా సమయంలో వీరోచితంగా పోరాడారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి హరీశ్ రావుకు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.





















