Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
Delhi Blast: ఢిల్లీ పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదుల బృందం ఫరీదాబాద్‌లోని అల్ ఫలా విశ్వవిద్యాలయం నుంచి పనిచేసింది. షాహీన్ మరియు అతని సహచరులతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఏర్పాటు చేశారు.

Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు టర్కీలో స్కెచ్ వేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇప్పుడు చిక్కిన మాడ్యుల్స్‌తో జేఈఎం హ్యాండ్లరు సమావేశమైనట్టు తెలుస్తోంది. డాక్టర్ ఉమర్‌నబీ, అతన సహచరుడు డాక్టర్ ముజమ్మిల్‌షకీల్ గానై టర్కీలో జేఈఎం హ్యాండర్లతో భేటీ అయ్యారు. ముంబై 26/11 తరహా దాడులు భారత్‌లో చేయాలని ప్లాన్ చేశారు. 2021న వీళ్ల భేటీ జరిగింది. ఇన్ని రోజులు సమయం కోసం ఎదురు చూస్తున్న ఉగ్రమూకు ఆపరేషన్ సిందూర్ తర్వాత తమ ప్లాన్ అమలు చేయడానికి రెడీ అయ్యారు. ఈ డాక్టర్లు ఇద్దరూ జేఎంఈ సూచనల మేరకు భారత్‌లో ముందుగా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ప్రత్యేకంగా టెలిగ్రామ్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి నిత్యం టచ్‌లో ఉంటూ వచ్చారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సోషల్ మీడియా గ్రూప్‌ల ద్వారా భారత్‌లో వైట్ కాలర్ టెర్రరిజాన్ని పెంచేందుకు సిద్ధపడ్డారు. అందుకే విద్యార్థులు, వైద్యులను టార్గెట్ చేసి ఈ గ్రూప్‌లలోకి ఆహ్వానించారు. వారిని ఉగ్రవాదంవైపు ఆకర్షించారు. ఎక్కడికక్కడ ప్రత్యే టీంలను ఏర్పాటు చేసుకొని జైఐఎంతో టచ్‌లో ఉంటూ భారత్‌లో విధ్వంసానికి కుట్ర చేశారు.
వీళ్లంతా కలిసి భారత్‌లో 200 ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్లు జరపాలని ప్లాన్ చేశారు. దీనికి డిసెంబర్ 6ను ఎంచుకున్నారు. ఆ రోజు బాబ్రీమసీదు కూల్చివేత దినం. అందుకే ఆ రోజు ప్రపంచమే నివ్వెరపోయేలా దాడికి ప్లాన్ చేశారు. అయితే ఫరీదాబాద్ రైడ్స్ తర్వాత వారి ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో కంగారుపడిన మాడ్యుల్స్ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో తమ వద్ద ఉన్న అమ్మోనియం నైట్రేట్‌ను పేల్చేశారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. వారికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. వారు ప్రయాణించిన కార్లను స్వాధీనం చేసుకుంది.
ఢిల్లీ ఉగ్రదాడి కేసును ఛేదించడానికి దర్యాప్తు సంస్థలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఏటీఎస్ బుధవారం (నవంబర్ 12, 2025) సాయంత్రం కాన్పూర్కు చెందిన ఒక వైద్యుడిని అదుపులోకి తీసుకుంది. డాక్టర్ షాహీన్ షాహిద్, అతని సోదరుడు డాక్టర్ పర్వేజ్లకు సంబంధించిన దర్యాప్తులో లభించిన కొత్త సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీ దాడి జరిగిన రోజున పర్వేజ్,షాహీన్తో సంబంధం ఉన్న వ్యక్తులతో మాట్లాడిన వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.
డాక్టర్ షాహీన్ విదేశీ సంస్థలతో సంబంధాలు, జైష్ మాడ్యూల్లో అతని పాత్రపై దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి రావచ్చని భావిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన 6 మంది పెద్ద వైద్యులు ఈ దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుకున్నారు.
ఫరీదాబాద్ నుంచి అనుమానాస్పద కారు స్వాధీనం
ఢిల్లీ కారు పేలుడు కేసులో అనుమానిత ఎరుపు రంగు ఈకో స్పోర్ట్స్ ఫోర్డ్ కారును ఫరీదాబాద్ పోలీసులు ఖండవాలి గ్రామంలో గుర్తించారు. దర్యాప్తు సంస్థలు అక్కడ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెతుకుతున్న కారు ఇదే. ఈ కారు ఉమర్ పేరు మీద నమోదై ఉంది. ఢిల్లీ పేలుడులో ఉపయోగించిన ఐ20 కారును నడిపింది ఉమర్ అని అనుమానిస్తున్నారు. అనేక సీసీటీవీ ఫుటేజీలలో ఉమర్ ఐ20 కారు నడుపుతున్నట్లు కనిపించడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
ఉమర్కు చెందిన ఈ ఈకో స్పోర్ట్స్ కారు ఢిల్లీలోని ఒక చిరునామాలో నమోదైందని పోలీసులు తెలిపారు. ఈ ఆధారంతో రాజధానిలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. అంతకుముందు, కారు కోసం ఢిల్లీ పోలీసులు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, చెక్‌పోస్టులు, సరిహద్దు పోస్టులను అప్రమత్తం చేశారు. ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసులకు కూడా అనుమానాస్పద కారు గురించి సమాచారం అందించారు. ఇప్పుడు పోలీసులు ఈ కారును ఫరీదాబాద్లో గుర్తించారు.
ఎన్ఐఏ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది
ఎన్ఐఏ ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కోసం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం నాడు, 10 మంది సభ్యుల ప్రత్యేక బృందానికి ఎన్ఐఏ ఏడీజీ విజయ్ సఖారే నేతృత్వం వహిస్తారని సమాచారం. ఇందులో ఒక ఐజీ, ఇద్దరు డిఐజీలు, ముగ్గురు ఎస్పీలు, మిగిలిన వారు డీఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు. దర్యాప్తు సంస్థలు సోషల్ మీడియా కార్యకలాపాలపై కూడా నిఘా ఉంచుతున్నాయి. ఢిల్లీ అంతటా మొబైల్ ఫోన్ల నుంచి డేటాను సేకరిస్తున్నాయి.





















