Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలను పులుల భయం పట్టి పీడిస్తోంది. నాలుగు రోజుల్లో రెబ్బెన, తిర్యాణి రేంజ్ పరిధిలో నాలుగు పశువులపై దాడి చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Adilabad district tigers: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బఫర్, కారిడార్ ఏరియాలలో పత్తి చేలల్లో సంచరిస్తూ కనిపించాయి. ఉమ్మడి జిల్లాలో పలు పశువులపై దాడి చేసి హతమార్చాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సాత్ మోరి గ్రామ శివారులోని ఓ పంటచేనులో రాత్రిపూట లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. రాత్రిపూట ఆ లేగదూడ అరవడంతో గమనించిన యజమాని మెస్రం బొజ్జు, టార్చ్ లైట్ వేసి చూడగా పెద్దపులి లేగదూడ మెడను పట్టుకుని ఉందని, టార్చ్ లైట్ వెలుగుకు పెద్దపులి భయపడి లేగదూడను వదిలిపెట్టి సిరిచెల్మ అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయిందని తెలిపారు.
స్థానికులకు సమాచారం తెలియజేయగా వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఉదయం అక్కడకు చేరుకున్న సిరిచెల్మ అటవీ రేంజ్ అధికారి నాగావత్ స్వామి, సెక్షన్ అధికారి చంద్రారెడ్డి, అటవీ శాఖ సిబ్బంది పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పులి హతమార్చిన లేగదూడను పరిశీలించి అక్కడ పులి పాదముద్రలను సేకరించారు. ఇది కచ్చితంగా పెద్దపులి అని నిర్ధారించారు. సిరిచెల్మ అటవీ శాఖ రేంజ్ అధికారి నాగావత్ స్వామిని ఫోన్ ద్వారా వివరణ కోరగా.. పెద్దపులి సంచారం వాస్తవమేనన్నారు. పులిదాడిలో లేగదూడ హతమైనట్లు వివరించారు. అదేవిధంగా పెద్దపులి సంచారం కారణంగా సమీప గ్రామాల ప్రజలు పత్తి కూలీలు రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరు ఉండవద్దని, గుంపులుగా ఉండాలని, రాత్రివేళలో ఎవరు బయటకు రావద్దని, పంటచేలలో ఎవరైనా సోలార్ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసి ఉంటే అవి తొలగించాలనీ, పులికి ఎవరు హాని తలపెట్టవద్దని, స్థానిక గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పులి దాడిలో హతమైన లేగదూడ యజమాని మెస్రం బొజ్జుకు రేంజ్ అధికారి అటవీశాఖ తరఫున పరిహారం అందజేస్తామన్నారు.
ఈ పులి నేరడిగొండ మండలంలోని గోధుమల్లే గ్రామ సమీపంలో పలువురు పులిని చూశామని గోధుమల్లె గ్రామం మీదుగా పెంబి అటవీ రేంజ్ వైపు వెళుతున్నట్లు పలువురు తెలిపారు. అయితే ఈ పులి గత కొద్ది రోజుల క్రితం బోథ్ రేంజ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ హడలెత్తించింది అక్కడి నుండి బోథ్, నేరడిగొండ రేంజ్ మీదుగా సిరిచేల్మ రేంజ్ అటవీ ప్రాంత పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరో పులి కూడా బోథ్ రేంజ్ పరిధిలోనే ఉందని, అది మహారాష్ట్ర వైపు వెళుతూ ఇటు వైపుగా వస్తుందన్నట్లు ఇదివరకే అధికారులు తెలిపారు.
అటు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోనూ రెండు పులులు హడలెత్తిస్తున్నాయి. ఇటీవలే గత కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుండి తెలంగాణలోని పెంచికల్ పేట లోని ఇటుకల పహాడ్, అక్కడ నుంచి కాగజ్ నగర్ అటవీ రేంజ్ పరిధిలో సంచరిస్తూ ఓ పులి రెబ్బేన రేంజ్ అటవీ ప్రాంతంలో సంచరించింది. మరో పులి తిర్యాణి రేంజ్ అటవీ ప్రాంతం వైపు వెళ్ళింది. గత నాలుగు రోజుల క్రితం రెబ్బెన పరిధిలో రెండు పశువులు, తిర్యాణి రేంజ్ పరిధిలో రెండు పశువులు పులి దాడిలో హతమైనట్లు తిర్యాణి రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఈ వింటర్ సీజన్ లో మేటింగ్ కోసం పెద్దపులులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఇలా సంచరిస్తూ ఉంటాయని అన్నారు. తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తు పోతుంటాయని అలాగే తాడోబా అభయారణ్యం నుండి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోను సంచరిస్తూ ఉంటాయన్నారు. సాధారణంగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లో వాటికి ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాల్లో గడ్డి పొదలలో ఉంటాయనీ, ఈ సీజన్లో అవి పరస్పరం కలుసుకోవడం కోసం ఇలా సంచరిస్తూ ఉండడం సాధారణమేనని, పులులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటికి ఎలాంటి హాని తలపెట్టవద్దని, పంట పొలాల్లో కూలీలు రైతులు గుంపులు గుంపులుగా పనులు చేసుకోవాలని, ఒంటరిగా ఎవరు ఉండకూడదని, గ్రామాల్లోను అవగాహన కల్పిస్తున్నామన్నారు.





















