Andhra Investments : ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
investments in AP: ఏపీలో మరో ఇరవై వేల కోట్లకుపైగా పెట్టుబడులకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. విశాఖ సమ్మిట్‌లో చేసుకున్న ఎంవోయూల్లో నెరన్నరలో సగం గ్రౌండింగ్ జరగనున్నాయి.

AP Investment Promotion Board approves over 20,000 crore more investments: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50 శాతానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం సచివాలయంలో 13వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో రూ.20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు 13వ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. దీంతో 56,278 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.
అలాగే విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలపై సీఎం సమీక్షించారు. 20 రోజుల క్రితం విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే... ఇప్పటికే రూ.7.69 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఎంఓయూలు అన్నింటికీ ఏయే జిల్లాల్లో ఏర్పాటు చేయాలి... ఎక్కడెక్కడ భూములివ్వాలనే అంశంపైనా నిర్ణయాలు జరిగాయి. ఇక మిగిలిన ఎంఓయూలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలి. 45 రోజుల్లోగా ఎంఓయూలు అన్నింటినీ గ్రౌండింగ్ అయ్యేలా చూడాలి. వీలైనన్ని ఎంఓయూలను గ్రౌండింగ్ చేసి... దావోస్ సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులను వస్తాయన్నారు. దావోస్ పర్యటనకు ముందే 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా చూడాలి. ఎంఓయూల గ్రౌండింగ్‌పై ప్రతీ వారం సీఎస్ సమీక్షించాలని ఆదేశించారు. ఇక నుంచి ఎస్ఐపీబీతో పాటు ఎంఓయూలపైనా స్వయంగా సమీక్షిస్తాను. జిల్లా కలెక్టర్లు కూడా వీటిపై దృష్టి పెట్టాలి. ఇక పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యే విధానానికి సంబంధించి ఓ విధానాన్ని రూపొందించాలని సూచించారు.
ఆమోదం పొందిన యూనిట్లు, పరిశ్రమలు నిర్దేశిత గడువులోగా ఏర్పాటు చేయాల్సిందే. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. వివిధ రంగాల్లో ఏపీని అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. అలాగే రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, గ్రీన్ ఎనర్జీ యూనివర్సిటీ వంటివి ఏర్పాటు చేయాలి. క్వాంటం వ్యాలీకి అడ్వైజరీ బాడీని నియమించండి. మెంటరింగ్, మోనిటరింగ్, వెంచర్ క్యాపిటల్ కోసం ఇది పనిచేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది స్టార్టప్‌లకు ఓ మెంటార్ గా వ్యవహరిస్తుంది. క్వాంటం వ్యాలీలో నిర్మించే 6 క్వాంటం టవర్లలో రెండు టవర్లను క్వాంటం అల్గారిథం డెవలప్మెంట్ కోసం... మరో రెండు టవర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం కేటాయించాలని సూచించారు. ఏఐ బేసిక్స్‌ను 7 తరగతి నుంచే బోధించేలా చర్యలు చేపట్టండి. మైక్రోసాఫ్ట్, గుగూల్ లాంటి కంపెనీల సాయంతో బృందాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ రంగ సంస్థలే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. యూఏఈ, దుబాయ్, సహా మరికొన్ని దేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు లక్షల కోట్ల రూపాయలతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వ కంపెనీలతోనే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఏపీ కూడా ఆ స్థాయికి రావాలి. రూ.500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఇక ఎర్లీబర్డ్ ప్రోత్సాహకాల అవకాశాలను మిగతా వారికి కూడా అందించేలా అన్ని శాఖలూ చూడాలి. ఈ మేరకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలపై వెసులుబాటు కల్పించేలా పాలసీని సడలించాలన్నారు.
రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశంలో ఆమోదించిన కంపెనీల వివరాలు
• చింతా ఎనర్జీ-రూ. 8500 కోట్లు-5800 ఉద్యోగాలు
• గనేకో త్రీ ఎనర్జీ-రూ. 2140 కోట్లు-1000 ఉద్యోగాలు
• శ్రేష్ట రెన్యూవబుల్స్-రూ. 70 కోట్లు-339 ఉద్యోగాలు
• క్యూపై ఇండియా-రూ. 47 కోట్లు-9 ఉద్యోగాలు
• క్యూబైటెక్ స్మార్ట్ సొల్యూషన్స్-రూ. 15 కోట్లు-30 ఉద్యోగాలు
• క్యూక్లైర్ వాయన్స్ క్వాంటం ల్యాబ్స్-రూ. 14 కోట్లు-5-12 ఉద్యోగాలు
• సైబ్రా నెక్స్-రూ. 10 కోట్లు-10-15 ఉద్యోగాలు
• క్యూ బీట్స్-రూ. 37 కోట్లు-40 ఉద్యోగాలు
• సెనటల్లా ఏఐ థెరా ప్యూటిక్స్-రూ. 6 కోట్లు-40 ఉద్యోగాలు
• ఫార్టీటూ42 టెక్నాలజీ ఇన్నోవేషన్స్-రూ. 9 కోట్లు-5-8 ఉద్యోగాలు
• సిప్సా టెక్ ఇండియా-రూ. 1140 కోట్లు-1251 ఉద్యోగాలు
• శ్రీ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్-రూ. 62 కోట్లు -500 ఉద్యోగాలు
• ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం-రూ. 30 కోట్లు-600 ఉద్యోగాలు
• నాన్రెల్ టెక్నాలజీస్-రూ. 50.67 కోట్లు-567 ఉద్యోగాలు
• పీవీఆర్ హస్పటాలిటీస్-రూ. 225 కోట్లు-1230 ఉద్యోగాలు
• మెగ్లాన్ లీజర్స్-రూ. 348 కోట్లు-1700 ఉద్యోగాలు
• యాగంటి ఎస్టేట్స్-రూ. 61 కోట్లు-250 ఉద్యోగాలు
• నాందీ హోటల్స్-రూ. 150 కోట్లు-222 ఉద్యోగాలు
• రిలయెన్స్ కన్స్యూమర్ ప్రొడెక్ట్స్-రూ. 1622 కోట్లు-1200 ఉద్యోగాలు
• రామయాపట్నం కార్గో రెసిప్షన్ టెర్మినల్-రూ. 1615 కోట్లు-1300 ఉద్యోగాలు
• సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్-రూ. 45 కోట్లు-300 ఉద్యోగాలు
• TGV SRAAC-రూ. 1216 కోట్లు-400 ఉద్యోగాలు
• శ్రీ వెంకటేశ్వర బయోటెక్-రూ. 122 కోట్లు-184 ఉద్యోగాలు
• ఎమర్జ్ గ్లాస్ ఇండస్ట్రీస్-రూ. 182 కోట్లు-415 ఉద్యోగాలు
• జీయట్ ఎనర్జీస్-రూ. 305 కోట్లు-300 ఉద్యోగాలు
• రామన్ సింగ్స్ గ్లోబల్ ఫుడ్ పార్క్-రూ. 141 కోట్లు-600 ఉద్యోగాలు
• గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్-రూ. 320 కోట్లు-700 ఉద్యోగాలు
• మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్-రూ. 343 కోట్లు-355 ఉద్యోగాలు
• విరూపాక్ష ఆర్గానిక్స్-రూ. 1225 కోట్లు-1500 ఉద్యోగాలు
• రాముకా గ్లోబల్ ఎకో వర్క్స్-రూ. 193 కోట్లు-426 ఉద్యోగాలు
• మాస్ ఫ్యాబ్రిక్ పార్క్-రూ. 200 కోట్లు-35000 ఉద్యోగాలు





















