Adilabad News: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చరచ్చ కొట్టకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
Adilabad News:ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని ఘర్షణపడ్డారు.

Adilabad News:ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ప్రోటోకాల్ వివాదం పిడిగుద్దులతో రణరంగంగా మారింది. బుధవారం బోథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా గొడవ జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పక్కనే స్టేజీపై బిఆర్ఎస్ నేతలు పాల్గొనగా కాంగ్రెస్ నేతలు అడ్డు తగిలారు.


ప్రోటోకాల్ లేకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. దీంతో మాటమాట పెరిగి పరస్పరం ఇరు పార్టీల నేతలు వాగ్వాదంతో జరిగింది. నువ్వెంత అంటే నువ్వేంతా, నీ స్థాయి ఎంత అంటూ ఒకరినొకరు వాదలాడుకున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి, ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితర నేతలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన తుల శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసిని నిలదీశారు.


చెక్కుల పంపిణీ రసాభాసగా మారుతుండగానే కార్యకర్తలు పరస్పరం దూసుకుంటూ కుర్చీలు విసురుకుంటూ పిడుగుద్దులతో కొట్టుకున్నారు. చొక్కాలు చినిగిపోయేంత వరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే ఇచ్చోడ, బోథ్ సిఐలు, ఎస్సెలు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలను చెదర గొట్టారు.


పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... బోథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తమ కార్యకర్తలు ఎలాంటి వివాదాలకు ప్రయత్నించలేదని, ఎవరిపై దాడి చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే తమ పార్టీ నాయకులపై ఎదురుదాడి చేసారని, ఇది కుట్ర పూరితంగానే చేశారని బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.





















