(Source: Poll of Polls)
Adilabad News: ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇవ్వలేదని దారుణం.. లబ్ధిదారురాలి భర్తను చెట్టుకు కట్టేసి వేధింపులు
Indiramma house bill | ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బిల్లు చెల్లించడం లేదని, విసిగిపోయిన ఓ గుత్తేదారు లబ్ధిదారురాలి భర్తను చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో జరిగింది.

Adilabad News | ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ సొమ్ము ఇవ్వనందుకు ఓ గుత్తేదారు లబ్దిదారురాలి భర్తను చెట్టుకు కట్టేసిన అమానవీయ ఘటన ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలోని కోట గ్రామానికి చెందిన లోకండే మారుతి భార్య పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇంటి నిర్మాణం చేపట్టేందుకు చింతలబోరి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే గుత్తేదారుతో మారుతి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
మొదట ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం బేస్మెంట్ వరకు పూర్తయింది. మొదటి విడతగా రూ. 1లక్ష లబ్ధిదారు ఖాతాలో ఇటీవల జమ అయింది. అయితే ఆ గుత్తేదారు తనకు నగదు ఇవ్వాలని లబ్ధిదారు భర్త మారుతినీ కోరాడు. పలుమార్లు అడిగి అడిగి విసిగిపోయాడు. బిల్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన గుత్తేదారు మంగళవారం సొనాల ప్రయాణ ప్రాంగణంలో మారుతిని తాడుతో చెట్టుకు కట్టేశాడు. తనకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించాడు. తన ఇంటిని నాణ్యంగా నిర్మించలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

రోడ్డు పై జనాలు గుమ్మి గుడటంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి ఆ ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరూ సైతం పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విషయం అంతటా చర్చ జరుగుతోంది. బిల్లులు ఇవ్వడం లేదని చెట్టుకు కొట్టేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





















