Tigers in Adilabad: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ సరిహద్దు అడవుల్లో ఆవాసం కోసం పులుల సంచారం..!
Tigers migrate to border forests of Adilabad district | మహారాష్ట్ర సరిహద్దులోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి పులులు వస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో పెద్దపులుల సంచారం అలజడి కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దులోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుండి పెన్ గంగానదీ తీరం దాటి తెలంగాణ సరిహద్దు దాటి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తూ రైతుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దుల్లో తడోబా అభయారణ్యం నుండి జిల్లాలోకి పులులు సంచరిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడే తిష్టవేసి పశువులు, మేకల గుంపులపై దాడి చేసి హతమారుస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం ఆదిలాబాద్ భీంపూర్ మండలంలోని సరిహద్దు గ్రామాల్లో పత్తి చేనులో పులి కనిపించింది. కొందరు రైతులు ధైర్యంగా సెల్ ఫోన్ లో పులి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలతో పత్తి ఏరే రైతులు కూలీలు భయాందోళనకు గురయ్యారు. పొలాల్లో రైతులు టపాసులు కాల్చి పనులు చేస్తున్నారు. అక్కడ నుంచి వెళ్ళిన పులి సరిహద్దులో గల బోథ్ మండలంలోని నిగిని, కంటెగాం, రఘునాథ్ పూర్, అజ్జర్, వజ్జర్, చింతల్ బోరి, డేడ్రా అటవీ శివారు గ్రామాల్లో సంచరిస్తోంది. అయితే పెద్దపులి అలికిడికి గ్రామాలన్ని వణికిపోతున్నాయి.

సరిహద్దు మహారాష్ట్రలోని చికిలి, శివిని, డాంకి, ఈసాపూర్, ఘన్ పూర్ మీదుగా ఓ ఆడపులి సంచరిస్తూ రైతుల్లో హడలెత్తిస్తుంది. అయితే పెంపుడు జంతువులైన ఆవులు, గేదెలు, మేకలను ఈ పెద్దపులి వేటాడి చంపినప్పుడే పులిజాడ నీడలు బయటపడుతున్నాయి. సామాన్య ప్రజలు, రైతులు పత్తి పంట చేనులోకి వెళ్లి పలు సందర్భాల్లో పెద్దపులిని చూసి బీతిల్లిపోవడం ఈవిషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందించడం జరుగుతుంది. ఇదివరకే సరిహద్దులోనీ కంటెగాం, రఘునాథ్ పూర్, నిగిని ప్రాంతాల్లో అటవీ సిబ్బంది పెద్దపులి కదలికలపై అన్వేషణ సాగిస్తూ పాదముద్రలు సేకరిస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు సేకరించి ట్రాప్ కెమెరాలను పెట్టీ పులి కదలికలపై నిఘా పెంచారు. రైతులు మాత్రం ఉదయం సాయంత్రం పూటల్లో పంట చేలకు వెళ్లవద్దని, పగలు వెలుతురున్నప్పుడు పంట చేలకు గుంపులు గుంపులుగా వెళ్లాలని, పెద్దపులి కనిపిస్తే అరుపులు కేకలతో హాడావుడి చేయాలని ఆటవీ అధికారులు సూచిస్తన్నారు.
ఈ విషయమై బోథ్ అటవీశాఖ రేంజ్ అధికారి ప్రణయ్ ను abp దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా.. పులి సంచారం వాస్తవమేనన్నారు. ప్రతీ ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి సంచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసాల్లోనే మేటింగ్ కోసం అనువైన వాతావరణం ఉంటుందన్నారు. పులి ఆవాసం కోసం ఈ ప్రాంతానికి తరచూ వస్తూ పోవడం ఈ కాలంలో శరమాములేనని, వ్యవసాయ పనుల్లో ఉండే కూలీలు రైతులు అప్రమత్తంగా ఉండేలా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పులి కదలికలపై ఎప్పటికప్పుడు పాదముద్రలు సేకరించి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని పులి సంచరించే ప్రాంతాల్లో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండి గుంపులు గుంపులుగా ఉండాలన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పనులు చేసుకుని వెళ్లాలని పులికి ఎలాంటి హాని చేయకూడదని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

అయితే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆడపులి జిల్లాలోని భీంపూర్ మండల సరిహద్దుల్లోనీ అటవీ ప్రాంతంలో మగపులి కదలికలు మేటింగ్ కోసమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆవాసానికి అనువైన ప్రదేశం కావడంతో తిప్పేశ్వర్ అభయారణ్యం దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయన్నాయి. ఇటీవల భీంపూర్ మండలంలోని తాంసి (కె) గ్రామ శివారులో గొంటిముక్కల అశోక్ పత్తి చేనులో పెద్దపులిని చూసి పరుగు పరుగున గ్రామానికి చేరుకున్నారు. పులి కదలికలను పసిగట్టి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. తాంసి (కె)గొల్లఘాట్, అర్లి, భగవాన్ పూర్ వడగాం, సరిహద్దు గ్రామాల్లో మగపులి చేస్తుంది. పత్తి, సోయాబిన్ రైతులు పంట చేతికి వచ్చే దశలో చేనుకు వెళ్లా లంటేనే భయంతో వణికిపోతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆవాసం అనువుగా ఉండటం, మరోవైపు వణ్య ప్రాణుల సంఖ్య పెరుగడంతో పెద్దపులుల రాకపోకలు ఈ ప్రాంతాల్లో పెరిగిపోయాయి.
అటు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్ పేట్, కౌటాల, దేహేగాం, కాగజ్ నగర్ అటవీ ప్రాంతాల్లోనూ పెద్ద పులులు సంచరిస్తున్నాయి. పులులు సంచరించే ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు పాదముద్రలను సేకరిస్తూ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తూ రైతులు కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో డప్పు చాటింపు సైతం నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.






















