Mahabubabad News: ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ - రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు, ఎక్కడంటే?
Telangana News: స్థలం రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన మహిళా అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలకు చిక్కారు.
Acb Caught Mahabubabad Sub Registrar: మహబూబాబాద్ (Mahabubabad) సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఏసీబీ అధికారులకు చిక్కారు. స్థలం రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో అధికారులు పక్కా ప్లాన్ తో శుక్రవారం ఆమె లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీశ్ ఇటీవల 128 గజాల స్థలం కొనుగోలు చేశారు. అయితే, రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను సంప్రదించగా.. ఆమె గజానికి రూ.200 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని గజానికి రూ.150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ తో.. బాధితుడు తస్లీమాకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం రూ.19,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అలాగే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బంది వద్ద ఉన్న రూ.1.78 లక్షలను సైతం ఏసీబీ అధికారులు సీజ్ చేసి సదరు డాక్యుమెంట్ రైటర్ ను అరెస్ట్ చేశారు. కాగా, తస్లీమా గతంలో ములుగు సబ్ రిజిస్ట్రార్ గా పని చేశారు.