(Source: ECI/ABP News/ABP Majha)
BJP Yatra : బీజేపీలో ప్రజాసంగ్రామ యాత్ర జోష్.. ప్రత్యేక టీంను పంపిన అమిత్ షా !
బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. టీఆర్ఎస్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకునేలా వ్యూహాలు రూపొందించేందుకు ప్రత్యేక బృందాన్ని అమిత్ షా పంపారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రజాసంగ్రామ యాత్ర కొత్త ఊపు తీసుకు వస్తోంది. బీజేపీ హైకమాండ్ కూడా యాత్రకు వస్తున్న స్పందనతో సంతృప్తిగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు రాజకీయాలనే మార్చిన చరిత్ర ఉండటంతో బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. యాత్ర విజయవంతానికి కావాల్సిన సాయం అంద చేస్తోంది. హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఓ టీంను హైదరాబాద్‌కు పంపినట్లుగా తెలుస్తోంది. ఈ టీం మార్గదర్శనంలోనే ప్రస్తుతం పాదయాత్ర వ్యూహాలు అమలు చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read : వైఎస్ సంస్మరణకు ఆత్మీయులు ఎందుకు హాజరు కాలేదు ?
ప్రజాసంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించి వారం అవుతోంది. వారం రోజుల పాటు ఆయన యాత్ర జరిగిన తీరును బీజేపీ హైకమాండ్ విశ్లేషించింది. యాత్రపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా సమాచారం తెలుసుకుంటున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా పర్యవేక్షణలో పనిచేసే ఆరుగురు సభ్యుల బృందం యాత్ర ప్రారంభాని కంటే ముందే హైదరాబాద్ వచ్చింది. ఆ టీం యాత్రను కోఆర్డినేట్ చేస్తోంది. ఆరుగురు సభ్యుల బృందం ప్రజా సంగ్రామ యాత్ర వెంటే సాగుతూ ఎప్పటికప్పుడు అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలకు నివేదికలు పంపుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ హైకమాండ్ సంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది.
Also Read : ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం కేసీఆర్ వెయిటింగ్
పాదయాత్రకు సంఘిభావం తెలిపేందుకు కేంద్రం ప్రతినిధులుగా ప్రతీ వారం ఓ కేంద్రమంత్రి లేదా జాతీయ స్థాయి నాయకుడ్ని పంపించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లో పార్టీ నిర్వహించే బహిరంగసభలో అమిత్ షా పాల్గొంటారు. అక్టోబర్ 2న తొలి విడత పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. వికారాబాద్‌లో నిర్వహించే సభలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆ తర్వాత జరగనున్న కార్యక్రమాల్లో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, ఇతర ముఖ్యనేతలు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. జిల్లాల్లో బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనేలా చూస్తారు.
తెలంగాణ బీజేపలో వర్గ పోరాటం ఉందన్న ప్రచారం ఉంది. అయితే ఈ వర్గ పోరాటాలు పార్టీ పనితీరుపైనా.. పాదయాత్రపైనా ప్రభావం చూపకుండా బీజేపీ హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని స్థాయిల్లోని నాయకులు ఈ యాత్రలో ఎంతమేరకు భాగస్వాములవుతున్నారనేదానిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొనేందుకు ఏం చేయాలనేదానిపై సూచనలు చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టిలో ఉండాలంటే ఏం చేయాలో హైకమాండ్ తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోంది.