30 Years Since CBN became CM : “చంద్రబాబు అను నేను”కు ముప్పై ఏళ్లు..! 'ఎక్కువ కాలం పాలించిన తెలుగు సీఎం' చేసింది ఏంటి..?
30 years for CM Chandrabau: తెలుగురాష్ట్రాల్లో ఎక్కువ సార్లు సీఎంగా చేసింది.. ఎక్కువ కాలం సీఎంగా ఉంది కూడా చంద్రబాబే.. ! ఈ ఎక్కువ కాలం అనే ట్యాగ్‌కు మించి ఆయనేమైనా చేశారా..?

CBN 30 Years: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి సారిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు అని తెలుగుదేశం పార్టీ సంబరాలు చేస్తోంది. అంతేకాదు ఆ స్థానానికి ఎక్కువ సార్లు ప్రమాణస్వీకారం చేసింది. ఎక్కువ కాలం సీఎంగా ఉంది కూడా ఆయనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కలిపి బాబు నాలుగు సార్లు సీఎంగా ప్రమాణం చేయగా.. మొత్తం మీద ఇప్పటి వరకూ 15ఏళ్లకు పైగానే ఆ పదవిలో ఉన్నారు. ఈ ఎక్కువ సార్లు… ఎక్కువ కాలం అనే ట్యాగ్‌లకు మించి చంద్రబాబు గురించి చెప్పుకోవలసిందేమైనా ఉందంటే.. ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయన జీవితాన్ని పరిశీలిస్తే చాలా విషయాలే కనబడతాయి.
పడిలేచిన కెరటం బాబు..
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం… కానీ చంద్రబాబు మొట్టమొదటి సారి ప్రమాణ స్వీకారం చేయడానికి దారి తీసిన పరిస్థితులపైనే రాజకీయంగా చాలా విమర్శలున్నాయి. ౩౦ ఏళ్లు అయినా ఆయన వాటిని భరిస్తూనే ఉన్నారు. ఇక ముందూ అవి తప్పవు. 1995 సెప్టెంబర్ 1న ఆయన ఎన్నికల్లో గెలుపు తర్వాత నేరుగా సీఎం అవ్వలేదు. అంతకు కొన్ని నెలలు ముందుగా సీఎంగా ప్రమాణం చేసింది ఎన్టీ రామారావు. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరుగుతోందన్న కారణంతో ఎమ్మెల్యేలతో చంద్రబాబు తిరుగుబాటు చేసి అధికారం దక్కించుకున్నారు. లక్ష్మీ పార్వతి సాకుతో ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దక్కించుకున్నాడని ప్రత్యర్థులు అంటారు. అది జరిగి ఇప్పటికి ౩౦ఏళ్లు అయింది.. ఆ తర్వాత ఆరు సాధారణ ఎన్నికలను, మరో రెండు మధ్యంతర ఎన్నికలను చంద్రబాబు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆ విమర్శ మాత్రం అలాగే కొనసాగుతోంది.

చంద్రబాబును పడిలేచిన కేరటంతో ఆయన అభిమానులు పోలుస్తుంటారు. ఎందుకంటే రాజకీయంగా తన పని అయిపోయిందనుకున్న ప్రతీసారి.. అంతకుమించి ఉత్సాహంతో పైకి లేచారు. తన పార్టీ పడిపోయిందన్న మాట వినిపించిన ప్రతీసారీ అంతకు మించిన ఫలితాలతో నిలబెట్టారు. ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోకు.. ఏ క్షణాల్లోనూ నమ్మకాన్ని కోల్పోకు అనే వ్యక్తిత్వ సూత్రాలకు నిలువెత్తు రూపం చంద్రబాబు. అది ప్రత్యర్థులు కూడా అంగీకరించే సత్యం. 2014కు ముందు అప్పటికే 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయి.. నీరసంగా, సిస్తేజంగా మారిన పార్టీని బీజేపీ సాయంతో ఒడ్డుకు తెచ్చిన ఉద్డండుడు చంద్రబాబు. అందే బీజేపీతో విబేధించి 2019లో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుని జగన్ అనే సునామీలో ఇక కనిపించడం కష్టం అనే స్థాయికి పడిపోయాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్‌తో ఇక ఆయన చాప్టర్ క్లోజ్ అనే పరిస్థితి వచ్చింది. ఈసారి జనసేన, బీజేపీని కలుపుకుని జగన్ ను కొట్టిన దెబ్బ నుంచి ఆ పార్టీ తేలుకోవడం కూడా కష్టం. అత్యంత శక్తివంతమైన రాజకీయనేత అనిపించిన జగన్‌ను అంత దారుణస్థాయిలో 11సీట్లకు పరిమితమయ్యేలా చంద్రబాబు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ మామూలిలుది కాదు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు ఇచ్చిన రిటార్ట్ ను చూసి రాజకీయ వ్యూహంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అనిపించారు. టీడీపీ పని ఆల్‌మోస్ట్ ఖతం అన్న ఆనందాన్ని ప్రత్యర్థులకు మిగల్చకుండా ఇప్పుడు అత్యత శక్తివంతమైన పార్టీగా మార్చారు.

సీఎం కాదు సీఈఓ
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని రెండు దశల్లో చూడొచ్చు.. ఉమ్మడి ఏపీ సీఎంగా 1995 నుంచి 2004 వరకూ ఓ లెవల్.. 2014 తర్వాత నవ్యాంధ్రకు ఇంకో లెవల్. హైదరాబాద్ రాజధానిగా ఉన్న ఉమ్మడి ఏపీకి సీఎంగా కన్నా.. సీఈఓ అనిపించుకోవడాన్ని చంద్రబాబు ఇష్టపడ్డారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీ బూమ్‌ను ఆధారం చేసుకుని .. రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడమే.. IT Politcian ఆఫ్ దియ మిలియనమ్ అనే ట్రాక్ రికార్డునూ సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌కు పెక్కు ఐటీ కంపెనీలు తెచ్చిన కర్తగా.. సైబరాబాద్ సృష్టికర్తగా ఆయనకు వేగంగా పేరొచ్చింది కానీ ఆయనకు అధికారాన్నిచ్చిన అసలైన ఓటర్లకు దూరం చేసింది. ఏపీని ఎక్కుడో నిలుపుదామనుకుని.. తనను ఆ స్థానంలో నిలిపిపిన ఓటర్లకు చంద్రబాబు దూరం అయ్యారు. అదే సమయంలో అసలైన ఓటర్లకు మరో నాయకుడు వైఎస్ దగ్గరై.. బాబును దెబ్బకొట్టారు
సైబర్ నుంచి సంక్షేమం వైపు
కంప్యూటర్లు కూడు పెడతాయా అని ఎదుటి వాళ్లు చేసిన ఆరోపణలకు.. కంప్యూటర్లు.. కూడు పెట్టే రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాయని బలంగా చెప్పలేకపోయారు. చివరకు ఆ రైతుల కారణంగానే రెండు సార్లు అధికారానికి దూరం కావడంతో సూపర్ సీఎం కాస్తా.. సంక్షేమబాట పట్టారు. అధికారాన్ని పొందాలంటే.. ఆ తర్వాత కాపాడుకోవాలంటే సంక్షేమరూట్ తప్పనిసరని అర్థమై ఉండాలి. ఆ తర్వాత నుంచి ఫించన్లు పెంపు రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డల సాయం అంటూ భారీ సంక్షేమ పథకాలను ప్రకటించారు. కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చంద్రబాబులో ఓ బాలెన్స్ కనిపిస్తుంటుంది. అప్పట్లో అమరావతి, పోలవరం లాంటి రెండు భారీ ప్రాజెక్టులను నడిపిస్తూనే సంక్షమం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. భారీగా రుణమాఫీ, ఫించన్ల పెంపు చేపట్టినా 2019లో ఓటమి తప్పలేదు. దాని నుంచి పాఠాలు నేర్చుకుని “ఆ విధంగా ముందుకెళుతున్నారు.”
ఈ ముప్పై ఏళ్ల పయనంలో ..
సీఎం హోదా పొందిన ఈ మూడు దశాబ్దాల్లో విజయశిఖరాలే కాదు.. అంతు లేని అగాధాలూ చూశారు చంద్రబాబు. ఆధునిక తెలుగు రాజకీయనాయకుల్లో మోస్ట్ పాపులర్ అనదగ్గ వారిలో ముందు వరుసలో ఉన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్‌కు ప్రతీకగా నిలిస్తే… చంద్రబాబు దానిని విశ్వవ్యాపితం చేసినవాడు.. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్… సంక్షేమ రథసారథిగా వైఎస్ కూడా ప్రజల మన్ననలను పొందినవారే. అయితే వీళ్లందరిలోకి ఎక్కువుగా ఇంటర్నేషనల్ అటెన్షన్ సాధించింది చంద్రబాబే.. ఏదో గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆయన తపన.. నిరంతర శ్రమ, కొత్తవాటిపై ఉత్సాహం… టెక్నాలజీపై మక్కువ చంద్రబాబును మిగతా వారికంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. అంతేకాదు.. తెలుగు నాయకుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించింది కూడా చంద్రబాబే. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో ఆ తర్వాత NDA ప్రభుత్వాల్లోనూ బాబు హవా నడిచింది.

చంద్రబాబుకు ప్రచార కాంక్ష ఉన్నది నిజమే కానీ.. వాటిని ప్రచారం చేసుకోవడానికి ఆయన సాధించిన విజయాలు కూడా ఉన్నాయి. సైబరాబాద్ అంటూ నవీన హైదరాబాద్ విస్తరణకు ప్రయత్నించినా అమరావతి లాంటి భారీ రాజధానికి అంకురార్పణ చేసినా ఆయన ముద్ర స్పష్టం.. బిల్‌గేట్స్‌ను ఒప్పించి.. మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్‌కు తీసుకురావడం, సైబర్ టవర్స్, ISB,IIIT, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్ వంటి భారీ ప్రాజెక్టులు చంద్రబాబు విజన్‌కు తార్కాణంగా నిలుస్తాయి. రాజకీయాలకోసం ఎవరే విమర్శలు చేసినా.. అవి ఆయనే తెచ్చారన్నది వాస్తవం. అప్పట్లో India Today – “IT Indian of the Millennium” అని, టైమ్స్ మాగజైన్ “South Asian of the Year” అనీ గుర్తించాయి. చాలా అంతర్జాతీయ పత్రికలు అప్పట్లో చంద్రబాబును ప్రముఖంగా ప్రశంసించాయి. కేవలం ఐటీ హంగులే కాదు.. చంద్రబాబు పరిపాలనలోనూ చాలా మార్పులు తెచ్చారు. ప్రభుత్వం ఉండాల్సింది ప్రజల ముంగిటే అంటూ 'ప్రజల వద్దకు పాలన' తెచ్చారు ఆయన. ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లన్నింటీనీ కంప్యూటరకరించి.. సిటిజన్ చార్టర్ ద్వారా ప్రజలవద్దకు సేవలు తెచ్చిన ఫస్ట్ ప్రభుత్వం కూడా అదే.. ప్రజల్లో సమిష్టితత్వం పెంచడం కోసం తెచ్చిన శ్రమదానం, ఆ తర్వాత జన్మభూమి, నీరు -మీరు, ఇంకుడు గుంతలు, స్వచ్చాంధ్ర ఇవన్నీ కూడా పాతికేళ్ల కిందటే అమలు పరిచారు. అవే ఇప్పుడు వేరే రూపాల్లో తెచ్చారని టీడీపీ అభిమానులు చెప్పుకుంటూంటారు.

ఇన్ని ఘనతలున్నా.. ఆయనకు పబ్లిక్ కనెక్ట్ లేదన్నది విమర్శ. ఎన్టీఆర్, కేసీఆర్, వైఎస్సార్ తరహాలో చంద్రబాబు జనాలతో మమేకం కాలేకపోయారు. ఆయనలో ఎమోషన్ కోషంట్ తక్కువ ఉండటమే కారణమంటారు. అలాగే ప్రతీది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారనే విమర్శలున్నాయి. దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు పార్టీ కూటముల విషయంలో జంపింగ్‌లు చేసినవారే కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఆ ముద్ర చంద్రబాబుపైనే ఉంది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ చాలా పార్టీలతో పొత్తులు ఉండటం ఆ ముద్రను వేశాయి.
1975లో క్రీయాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు దేశంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబును ద్వేషించే వాళ్లు ఉండొచ్చు కానీ.. ఆయన ప్రజెన్స్ ను విస్మరించే వాళ్లు లేరు. రాజకీయాల్లో కానీ, పరిపాలన, అభివృద్ధి విషయంలో కానీ.. చాలా బలమైన ముద్ర ఆయనది.





















