గూగుల్‌లో ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్ సెర్చ్ ఇదే - దీన్ని మీరు ఊహించి కూడా ఉండరు!
ఈ సంవత్సరం గూగుల్‌లో టాప్ ట్రెండింగ్ సెర్చ్‌ల జాబితా విడుదల అయింది.
Google Top Trending Searches 2022: గూగుల్ ఇటీవల తన వార్షిక ఇయర్ ఇన్ సెర్చ్ రిపోర్ట్ 2022ని విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్‌లకు సంబంధించిన కొన్ని ప్రముఖ సెర్చ్‌ల వివరాలు షేర్ చేశారు. ఒక బ్లాగ్ పోస్ట్ ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ గేమ్ 'Wordle' గ్లోబల్ లిస్ట్‌లో (ప్రపంచవ్యాప్తంగా) టాప్ ట్రెండింగ్ సెర్చ్‌గా నిలిచింది. దీని తరువాత, ఈ సంవత్సరంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ వర్డ్ 'India Vs England'. ఈ జాబితాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలలో 'Ukraine' మూడవది. 'Queen Elizabeth', 'India vs South Africa' నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. దీంతో పాటు 2022లో ట్రెండింగ్‌లో ఉన్న వ్యక్తులు, సినిమాలు, ఇతర విషయాల జాబితాను కూడా గూగుల్ విడుదల చేసింది.
2022లో టాప్ ట్రెండింగ్ సినిమాలు
గూగుల్ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం "థోర్: లవ్ అండ్ థండర్," "బ్లాక్ ఆడమ్," "టాప్ గన్: మావెరిక్," "ది బాట్‌మాన్,", "ఎన్కాంటో" సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి.
2022లో టాప్ ట్రెండింగ్ వ్యక్తులు మరియు నటులు
గూగుల్ ప్రకారం, అత్యధికంగా సెర్చ్ అయిన వ్యక్తుల జాబితాలో నటుడు జానీ డెప్ నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. తన తరువాత విల్ స్మిత్, అంబర్ హర్డ్, వ్లాదిమిర్ పుతిన్, క్రిస్ రాక్‌లను ఎక్కువగా శోధించారు. కాగా టాప్ ట్రెండింగ్ నటుల జాబితాలో జానీ డెప్, విల్ స్మిత్ మరియు అంబర్ హర్డ్ టాప్-3లో ఉన్నారు. దీని తర్వాత ఈ జాబితాలో క్రిస్ రాక్ నాలుగో స్థానంలో, జాడా పింకెట్ స్మిత్ ఐదో స్థానంలో ఉన్నారు.
2022లో టాప్ ట్రెండింగ్ పాటలు
అలీ సేథి పసూరి టాప్ ట్రెండింగ్ పాటలలో నంబర్-1 స్థానంలో ఉంది. దీని తర్వాత బటర్ - బీటీఎస్, చాంద్ బలియన్ - ఆదిత్య ఎ, హీట్ వేవ్స్ - గ్లాస్ యానిమల్స్, ఎనిమీ - ఇమాజిన్ డ్రాగన్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.
2022లో భారతదేశంలోని టాప్ ట్రెండింగ్ విషయాలు
భారతదేశంలో ఈ సంవత్సరం టాప్ 5 సెర్చ్‌ల్లో చాలా క్రీడలు తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత కో-విన్, ఫిపా ప్రపంచ కప్, ఆసియా కప్, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లు ఉన్నాయి.
బ్రహ్మాస్త్ర, కేజీయఫ్: చాప్టర్ 2 టాప్ మూవీ ట్రెండింగ్ సెర్చ్‌ల జాబితాలో టాప్‌లో ఉన్నాయి. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ మూవీ సెర్చ్‌ల టాప్ 10 లిస్ట్‌లో కూడా చోటు దక్కించుకున్నాయి. దీని తర్వాత హిందీలో ది కశ్మీర్ ఫైల్స్, లాల్ సింగ్ చద్దా, దృశ్యం 2, తెలుగులో RRR, పుష్ప: ది రైజ్, కన్నడలో కాంతారా, తమిళంలో విక్రమ్, ఇంగ్లిష్‌లో థోర్: లవ్ అండ్ థండర్ ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్ చిత్రాలలో ఉన్నాయి.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?