Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Social Media Ban in Australia: ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఇది పెద్ద రివల్యూషన్ అని చెప్పవచ్చు.
Social Media Ban for Children Under 16: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే దిశగా ఆస్ట్రేలియా పెద్ద అడుగు వేసింది. బుధవారం ఈ బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అధిక మద్దతుతో ఆమోదించారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 102 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాయిటర్స్ కథనం ప్రకారం, గూగుల్, మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలు దీనిని నిషేధించాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ చట్టాన్ని సోషల్ మీడియాకు సంబంధించి ప్రపంచంలోని కఠినమైన నిబంధనలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ బిల్లు బుధవారం సెనేట్‌లో చర్చకు రానుంది. సంవత్సరం చివరి పార్లమెంటరీ రోజు అంటే గురువారం నాటికి ఆమోదం పొందాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నిషేధంపై చర్ఛ ఎప్పుడు ప్రారంభం అయింది?
పార్లమెంట్‌లో ఈ అంశంపై ఉద్వేగభరితమైన చర్చ జరిగిన తర్వాత పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడం గురించి ఈ ప్రతిపాదన వచ్చింది. సైబర్ బుల్లీయింగ్ కారణంగా తమ పిల్లలు తమకు తామే హాని చేసుకుంటున్నారని చాలా మంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చట్టం పిల్లల గొంతులను అణిచివేసే లక్ష్యంతో ఉందని యువ హక్కుల న్యాయవాదులు చెబుతున్నప్పటికీ పిల్లలు అంత చిన్న వయస్సులో ఇంటర్నెట్ ప్రపంచాన్ని సురక్షితంగా అర్థం చేసుకోలేరని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
యువకులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను నిషేధించడం సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు. దీని కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యే మార్గాలు అంతం అవుతాయని వారు అంటున్నారు.
Also Read: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?
పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాన్ని ఎత్తిచూపడం ద్వారా ప్రధాన మంత్రి అల్బనీస్ ఈ చట్టానికి మద్దతును పొందారు. వచ్చే ఎన్నికలకు ముందు ఈ చర్య తనకు అనుకూలంగా సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
బిల్లు ప్రకారం సోషల్ మీడియా సంస్థలు పిల్లల భద్రతను నిర్ధారించడానికి వయస్సు ధృవీకరణ చర్యలను అమలు చేయాలి. పాటించని కంపెనీలు 49.5 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల (మనదేశ కరెన్సీలో దాదాపు రూ.270 కోట్లు) వరకు జరిమానా విధించవచ్చు.
ఆస్ట్రేలియన్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన తర్వాత బయోమెట్రిక్స్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించే వయస్సు ధృవీకరణ వ్యవస్థను పరీక్షించనున్నారు. సెనేట్ కమిటీ ఈ వారం బిల్లును ఆమోదించింది. అయితే పాస్‌పోర్ట్‌లు లేదా డిజిటల్ ఐడీల వంటి వ్యక్తిగత సమాచారాన్ని అందించాల్సిందిగా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను బలవంతం చేయకూడదనే షరతును జోడించారు.
నిషేధానికి ప్రజల మద్దతు
యూగోవ్ సర్వే ప్రకారం నిషేధానికి 77 శాతం మంది ఆస్ట్రేలియన్ ప్రజల నుంచి మద్దతు లభించింది. ఇది ఆగస్టులో 61 శాతం ఉండగా నవంబర్‌కు ఏకంగా 77 శాతానికి పెరిగింది. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్, రూపర్ట్ మర్డోచ్ న్యూస్ కార్ప్ వంటి మీడియా సంస్థలు కూడా నిషేధానికి మద్దతు ఇచ్చాయి.
న్యూస్ కార్ప్ "లెట్ దెమ్ బి కిడ్స్" అనే ప్రచారాన్ని నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాల నుంచి పిల్లలను కాపాడుతుందని పేర్కొంది. ఈ బిల్లు ఆమోదం ఆస్ట్రేలియాలోని పిల్లల డిజిటల్ భద్రతకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు.
Also Read: 5000 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్... రెండిట్లో ఏ బ్యాటరీ ఆప్షన్ బెస్ట్!