SMS Scam: ఈ మెసేజ్‌లు క్లిక్ చేస్తున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ, రూటు మార్చిన హ్యాకర్లు!
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. టెలికాం శాఖ మాదిరిగా మెసేజ్ లు పంపిస్తూ.. సాధారణ జనాల బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు..
టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్ది.. సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త పద్ధతుల్లో హ్యాకర్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలపై పెద్దగా అవగాహన లేని సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకుంటున్నారు. వారి ఫోన్లలోకి మాల్వేర్ ను పంపించి వ్యక్తిగత సమాచారం, వారి బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలిస్తున్నారు. ఆ తర్వాత అకౌంట్లలోని డబ్బును మాయం చేస్తున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ రిటైర్ట్ టీచర్ హ్యాకర్ల బారిన పడి.. తన అకౌంట్ లోని రూ. 22 లక్షలను కోల్పోయారు. ఇంకా ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారు. గడిచిన కొంత కాలంగా టెలికం శాఖ తరహాలో మెసేజ్‌లు పంపిస్తూ, వాటిని క్లిక్ చేసిన వెంటనే వారి డేటాను కొల్లగొడుతున్నారు హ్యాకర్లు. అనంతరం వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
ఇలాంటి మెసేజులు వస్తే జాగ్రత్త: హ్యాకర్లను టార్గెట్ చేసుకున్న వినియోగదారులకు.. "ప్రియమైన కస్టమర్, మీ పరికరం ఫోన్ బోట్ నెట్ మాల్వేర్ బారిన పడి ఉండవచ్చు. భారత ప్రభుత్వం యొక్క సైబర్ స్వచ్ఛతా ప్రాజెక్ట్ ప్రకారం, దయచేసి http://cyberswachhtakendra.govని సందర్శించండి. మాల్వేర్ నుంచి కాపాడుకోండి” అనే ఎస్ఎమ్మెస్ వస్తుంది. అది నిజమని భావించి చాలామంది ఆ లింక్‌ను క్లిక్ చేస్తారు. వెంటనే వారి ఫోన్ లోకి హ్యాకర్లు పంపిన మాల్వేర్ ఇన్ స్టాల్ అవుతుంది. మీ వివరాలు అన్నీ సదరు హ్యాకర్ల దగ్గరికి వెళ్లిపోతాయి. స్కామర్ లు మీ ఫోన్లను హ్యాక్ చేయడానికి, మీ వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. వాస్తవం ఏంటంటే.. టెలికాం విభాగం కొన్ని విషయాల గురించి వినియోగదారులను అప్రమత్తం చేయవలసి వస్తే.. అధికారికంగా ప్రకటిస్తుంది. అంతేకానీ.. మేసేజ్ లను పంపించదు. అందుకే ఎలాంటి సందేహాత్మక ఎస్ ఎమ్మెస్ వచ్చినా.. వాటిని క్లిక్ చేయకూడదు. మీ మిత్రులకు సైతం ఫార్వర్డ్ చేయకూడదు.
అలాంటి మెసేజ్‌లను క్లిక్ చేయొద్దు: ఇప్పటికే వినియోగదారులకు తమ శాఖ పేరుతో వస్తున్న మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని టెలికం అధికారులు తెలిపారు. ఆ మెసేజ్ లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అవసరమైన చర్య కోసం సంబంధిత TSP/డివిజన్‌కు ఫార్వార్డ్ చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు.. తాజాగా రిలయన్స్ జియో పేరిట కూడా ఇలాంటి మాల్వేర్స్ పంపబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ వినియోగదారులను జియో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఏ సమయంలోనైనా ఇటువంటి హానికరమైన లింక్‌లపై క్లిక్ చేయవద్దని కోరింది.
ఆ మెసేజ్‌లో ఈ పదాలుంటే అప్రమత్తం కావాలి: మోబైల్ వినియోగదారులు సైతం ఇలాంటి మేసేజ్ లను చూసినట్లైతే.. మెసేజ్ పంపినవారి పేరును పరిశీలించండి. DoT అటువంటి సందేశాన్ని పంపినట్లయితే, పంపినవారి పేరు DoT వంటి కీలక పదాలను కలిగి ఉంటుంది. అనుమానాస్పద లింక్ లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. అంతేకాదు.. తెలియని వారు ఇలాంటి మెసేజ్ లను పంపిస్తే అస్సలు ఓపెన్ చేయకూడదు. ఇలాంటి సందేశాలను వేరొకరికి ఫార్వార్డ్ చేయకూడదు. మీకు ఇలాంటి మెసేజ్ లు వస్తే, వెంటనే వాటిని డిలీట్ చేయాలి. అలాంటి లింక్‌లపై క్లిక్ చేసే ముందు.. URLని బాగా చదవాలి. gov.in అనే డొమైన్ పేరుతో వచ్చే మెసేజ్ ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. గడిచిన కొంత కాలంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ ఐటీ శాఖ గూగుల్ తో కలిసి పనిచేయబోతుంది. ఆన్ లైన మోసాలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకోబోతుంది. ఇప్పటికే గూగుల్ ఈ దిశగా అడుగులు వేస్తున్నది.
Also Read: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి!
Also Read: మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? ఈ 5 టిప్స్ పాటించండి