Upcoming Smartphones: రేపు ఒక్కరోజే ఐదు ఫోన్ల లాంచ్ - ఏయే కంపెనీలు తీసుకొస్తున్నాయి?
Redmi Note 13 Series: రేపు (జనవరి 4వ తేదీ) మనదేశంలో ఏకంగా ఐదు స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.
Vivo X100: కొత్త సంవత్సరాన్ని టెక్ కంపెనీలు గ్రాండ్‌గా స్టార్ట్ చేయనున్నాయి. రెడ్‌మీ, వివో కంపెనీలకు సంబంధించిన ఐదు ఫోన్లు రేపు (జనవరి 4వ తేదీ) మార్కెట్లో లాంచ్ కానున్నాయి. వీటిలో బడ్జెట్, మిడ్, ఫ్లాగ్‌షిప్ నుంచి ప్రీమియం వరకు అన్ని కేటగిరీలు ఉన్నాయి. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే వీటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
రెడ్‌మీ తన మోస్ట్ పాపులర్ నోట్ 13 సిరీస్‌ను విడుదల చేస్తుంది. ఇందులో రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్లు ఉండనున్నాయి. వివో అదే రోజున వివో ఎక్స్100 సిరీస్‌ను కూడా తీసుకురానుంది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఉండనున్నాయి. ఈ రెండు సిరీస్‌లకు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. మీరు ఆయా కంపెనీల యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఫోన్ల లాంచ్ ఈవెంట్‌ను చూడవచ్చు.
రెడ్‌మీ నోట్ 13 సిరీస్ ఫీచర్లు
రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ మూడు ఫోన్‌ల్లోనూ 6.67 అంగుళాల 1.5కే ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడల్‌లో మీరు వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను పొందుతారు. దీనిలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండనున్నాయి. రెడ్‌మీ నోట్ 13 ప్రో మోడల్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్లపై పని చేయనున్నాయి. బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ను కంపెనీ అందించనుంది.
వివో ఎక్స్100 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా...
వివో సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో మార్కెట్లోకి రానుంది. వివో ఎక్స్100 ప్రారంభ మోడల్‌లో కంపెనీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనుంది. ఇక వివో ఎక్స్100 ప్రో మోడల్‌లో 100W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని చూడవచ్చు.
వివో ఎక్స్100 సిరీస్ ధర కూడా ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. వివో ఎక్స్100 ధర మనదేశ మార్కెట్లో రూ.63,999 నుంచి ప్రారంభం కానుందని టెక్‌అవుట్‌లుక్ తమ కథనంలో పేర్కొంది. ఇది ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ అని సమాచారం. ఇక వివో ఎక్స్100 ప్రో ధర రూ.89,999 నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు మనదేశంలో మరిన్ని ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!