(Source: ECI/ABP News/ABP Majha)
Nokia Classic Phones: నోకియా లవర్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త హంగులతో మళ్లీ వస్తున్న పాత ఫోన్లు, ఫీచర్స్ ఇవే
టెక్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్ననోకియా ఈ ఏడాది మూడు క్లాసిక్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. పాత డిజైన్లనే కొత్త అప్ డేట్స్ తో వినియోగదారులకు పరిచయం చేయబోతోంది.
Nokia Classic Phones 2024: నోకియా. టెలీ ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మోబైల్ ప్రియులను నోకియా ఫోన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫోన్ క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్, తక్కువ ధర కారణంగా చాలా మంది నోకియా ఫోన్లను వినియోగించేందుకు ఇష్టపడేవారు. కానీ, ఇతర కంపెనీల నుంచి వచ్చిన పోటీని తట్టుకోలేకపోయింది నోకియా. అడపాదడపా కొత్త ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నా, పోటీ ప్రపంచంలో పెద్దగా రాణించలేకపోతుంది. అయితే, క్లాసిక్ ఫోన్లను వాడే వాళ్లు ఇప్పటికే నోకియాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మూడు ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు నోకియా వెల్లడించింది.
మూడు ఫీచర్ ఫోన్లు మార్కెట్లోకి తేబోతున్న నోకియా
సరికొత్త ఫీచర్ ఫోన్లకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే నోకియా వెల్లడించింది. నోకియా 6310 (2024), నోకియా 5310 (2024), నోకియా 230 (2024) పేరుతో వీటిని వినియోగదారుల ముందుకు తీసుకురాబోతోంది. చిన్న, సరసమైన ఫోన్లను ఇష్టపడే వారి కోసం కంపెనీ పాత డిజైన్‌లను మళ్లీ రూపొందించడం ఇదే తొలిసారి కాదు. కానీ, ఈసారి మరిన్ని హంగులతో ఈ ఫోన్లు తీసుకురాబోతోంది.
సరికొత్త మార్పులతో 3 నోకియా ఫోన్లు
నోకియా 6310(2024) నిజానికి నోకియా 6310 (2021) మాదిరిగానే ఉంటుంది. వెనుక VGA ఫ్లాష్ కెమెరా, 2.8-అంగుళాల LCD స్క్రీన్, డ్యూయల్ సిమ్ స్లాట్ ఉన్నాయి. గతంలో పోల్చితే ఇప్పుడు 1,450 mAh బ్యాటరీ, ఈజీ ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్ ను యాడ్ చేసింది. ఇక నోకియా 5310(2024) నోకియా 5310 (2020) మోడల్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉంది. బ్యాటరీ సామర్థ్యం కూడా పెంచుతుంది. లేటెస్ట్ చిప్‌సెట్, 2.8-అంగుళాల LCD డిస్ ప్లేని కూడా అందిస్తోంది. 8/16 MB మెమరీ, SD కార్డ్ స్లాట్, డ్యూయల్ స్పీకర్లు, ఇన్ బిల్డ్ FM రేడియోతో రాబోతోంది. నోకియా 230(2024) నోకియా 230(2015) మాదిరిగానే ఉంటుంది. కానీ, పెద్ద బ్యాటరీతో. ఫోన్ 2.8-అంగుళాలTFT స్క్రీన్ 65K కలర్ లో రానుంది.USB-C పోర్ట్, Unisoc 6531F చిప్‌సెట్, బ్లూటూత్ 5.0తో వస్తుంది. ముందు, వెనుక భాగంలో 2 MP కెమెరా, 3.5 mm ఆడియో జాక్ తో పాటు పాత మోడల్ మాదిరిగానే 8/16 MB స్టోరేజ్ ను కలిగి ఉంది. అయితే, ఈ మూడు ఫోన్లు 2G నెట్వర్కింగ్ సపోర్టును కలిగి ఉన్నాయి.
త్వరలో ధరలపై క్లారిటీ ఇవ్వనున్న నోకియా
అయితే, ఈ కొత్త ఫోన్ల ధరలపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, మిగతా కంపెనీల ఫీచర్ ఫోన్లతో పోల్చితే చాలా తక్కువ ధరతో లభిస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే రేట్ల విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్లతో మార్కెట్లో తన ప్రొడక్ట్స్ కు మంచి గిరాకీ ఉందని నిరూపించుకోవాలని భావిస్తోంది నోకియా.
HMD launches Nokia 6310, Nokia 5310 and Nokia 230 featurephones https://t.co/O7pEEnxOLr pic.twitter.com/mtFS3UIGYy
— GSMArena.com (@gsmarena_com) April 11, 2024
Read Also: ప్రపంచంలోనే మొదటిసారి అలాంటి డిస్‌ప్లేతో ఫోన్ - రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ లాంచ్!