Motorola X30 Pro: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ - 200 + 50 + 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో మోటొరోలా మొబైల్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా 200 మెగాపిక్సెల్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్ అయింది.
మోటొరోలా ఎక్స్30 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు కర్వ్‌డ్ ప్యానెల్‌ను అందించారు. 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ కావడం విశేషం. ముందువైపు పంచ్ హోల్ డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. ప్రపంచంలో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే.
మోటొరోలా ఎక్స్30 ప్రో ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగా (సుమారు రూ.43,600) నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లుగానూ(సుమారు రూ.49,500), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లుగానూ (సుమారు రూ.53,000) ఉంది. ఇది ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
మోటొరోలా ఎక్స్30 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ఫోన్‌లో 6.73 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. పైన చెప్పినట్లు ఫోన్ వెనకవైపు కర్వ్‌డ్ ప్యానెల్‌తో వస్తుంది. పంచ్ హోల్‌ను ఫోన్ మధ్య భాగంలో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ ఎక్కనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
మోటొరోలా ఇటీవలే మోటో జీ71 5జీ స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో తగ్గించింది. ఈ ఫోన్ ధరపై ఏకంగా రూ.3,000 తగ్గింపు అందించడం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మోటో జీ71 5జీలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర లాంచ్ సమయంలో రూ.18,999గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దీన్ని రూ.15,999కు తగ్గించారు. ఆర్కిటిక్ బ్లూ, నెఫ్ట్యూన్ గ్రీన్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!