Jio Bharat V2 4G: రూ.1,000 లోపే జియో 4జీ ఫోన్ - ముకేష్ అంబానీ మాస్టర్ ప్లాన్!
భారతదేశ నంబర్ వన్ టెలికాం బ్రాండ్ జియో రూ.1000లోపే 4జీ ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది.
Jio Bharat V2 4G: రిలయన్స్ జియో కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనికి జియో భారత్ వీ2 4జీ అని పేరు పెట్టింది. ప్రస్తుతం 2జీ మొబైల్ ఉపయోగిస్తున్న 25 కోట్ల మంది వినియోగదారులే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లకు ప్రత్యేకమైన ప్లాన్లు కూడా ప్రకటించింది.
జియో భారత్ వీ2 4జీ ధర
దీని ధరను రూ.999గా నిర్ణయించారు. ప్రస్తుతం మనదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫోన్లలో అత్యంత చవకైనది ఇదే. రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో జియో భారత్ వీ2 4జీ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు జియో ఫీచర్ ఫోన్లను తీసుకురాలేదు. ఇదే మొదటిసారి.
జియో భారత్ వీ2 4జీ బీటా ట్రయల్
దీనికి సంబంధించిన బీటా ట్రయల్ జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతగా 10 లక్షల ఫోన్లను తయారు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 6500 ప్రాంతాల్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ జరగనున్నాయి.
జియో భారత్ వీ2 4జీ ఫీచర్లు
ఈ మొబైల్ ఫీచర్లను పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు. జియో సినిమా, జియో సావన్ లాంటి జియో సొంత యాప్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉండనుంది. వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.
జియో భారత్ వీ2 4జీ ప్లాన్లు
జియో భారత్ వీ2 4జీ ప్లాన్లను కూడా కంపెనీ ప్రకటించింది. రూ.123 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభించనున్నాయి. ఇదే లాభాలతో వచ్చే వార్షిక ప్లాన్ ధర రూ.1,234గా ఉంది.
రిలయన్స్ జియో మోస్ట్ అవైటెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్ 5జీకి సంబంధించి ఇటీవలే కొత్త అప్‌డేట్ వచ్చింది. జియో ఫోన్ 5జీ ఇమేజ్ ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ఈ ఏడాది దీపావళికి ఈ ఫోన్‌ను విడుదల చేయవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. లీకైన ఫోటోలో ఫోన్ వెనుక ప్యానెల్, ముందువైపు డిజైన్ చూడవచ్చు. ఇంతకు ముందు కూడా ఈ ఫోన్‌కు సంబంధించిన సమాచారం ఎన్నోసార్లు లీక్ అయింది.
ఒక ట్విట్టర్ వినియోగదారుడు ఈ ఫోన్ ఫొటోను షేర్ చేశారు. ఈ సంవత్సరం దీపావళి లేదా న్యూ ఇయర్ మధ్య ఎప్పుడైనా ఈ ఫోన్ మార్కెట్లోకి రావచ్చని అందులో పేర్కొన్నారు. జియో ఫోన్ 5జీ యూనిసోక్ 5జీ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చని ఈ యూజర్ తెలిపారు. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా చూడవచ్చు. ఇందులో ప్రధాన కెమెరా కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవచ్చు.
లీకైన ఫొటోలను పోస్ట్ చేసిన ట్విట్టర్ యూజర్ జియో ఫోన్ 5జీ ధర గురించి కూడా సమాచారం ఇచ్చారు. దీని ధర సుమారు రూ. 10,000 రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. రిలయన్స్ జియో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలో జియో ఫోన్ సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో ఇప్పుడు 5జీ హ్యాండ్‌సెట్ కూడా రానుంది.
Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial