Lenovo IdeaPad Slim 5 Pro: లెనోవో నుంచి ఐడియా ప్యాడ్ ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లు ఇవే..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్ మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరు లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 ప్రో. దీని ధరను రూ.77,990గా నిర్ణయించారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్ ఇండియాలో లాంచ్ అయింది. దీని పేరు లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 ప్రో. లెనోవో నుంచి వచ్చిన ఐడియా ప్యాడ్ సిరీస్‌లో ఇది లేటెస్ట్ వెర్షన్. ఈ ల్యాప్‌టాప్‌లో.. 2.2కే ఐపీఎస్ డిస్‌ప్లే ఉండనుంది. జీరో టచ్ లాగిన్, డాల్బీ అట్మాస్ ఆడియో టెక్నాలజీ, డ్యూయల్ ఎరే మైక్రో ఫోన్ వంటివి కూడా ఇందులో అందించారు. ఈ ల్యాప్‌టాప్ 11వ జనరేషన్ ఇంటెల్ కోర్, ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లతో పనిచేయనుంది. యూజర్లు తమ అవసరాల ఆధారంగా ప్రాధాన్యతలను ఎంచుకునే వీలు కల్పిస్తున్నట్లు లెనోవా తెలిపింది.
లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 ప్రో ధర..
లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 ప్రో ధర రూ.77,990గా ఉంది. ఇది స్టార్మ్ గ్రే కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు.. లెనోవో డాట్ కామ్, ఆన్‌లైన్ షాపింగ్ సైట్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లను సంప్రదించవచ్చు.
లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 ప్రో స్పెసిఫికేషన్లు
ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 ప్రో ల్యాప్‌టాప్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. దీనిని విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇందులో 14 అంగుళాల 2.2కే, 16 అంగుళాల డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ (WQXGA) ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే వెర్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఏఎండీ రైజెన్ 7, ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్ వేరియంట్లు కూడా అందించారు.
దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంటుంది. 16 జీబీ డీడీఆర్ 4 ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ, ఎన్‌వీడియా జీఫోర్స్ గ్రాఫిక్స్, ఏఎండీ రేడియోన్ సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లుగా.. స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, వైఫై 6, బ్లూటూత్ వీ5.1 వంటివి ఉన్నాయి.
14 అంగుళాల వేరియంట్‌లో 56.5 డబ్ల్యూహెచ్ఆర్ (WHR).. 16 అంగుళాల వేరియంట్‌లో 75 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీని అందించారు. 14 అంగుళాల వేరియంట్ 1.4 కేజీల బరువును .. 16 అంగుళాల వేరియంట్ 1.9 కేజీల బరువును కలిగి ఉన్నాయి.