BCCI on IPL 2021: IPL సమయంలో 30వేల కరోనా టెస్టులు... 100 మందితో మెడికల్ టీం... తెలిపిన BCCI
IPL - 2021 సమయంలో 30వేల RT-PCRటెస్టులు నిర్వహించనున్నట్లు BCCI ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నెల 19 నుంచి IPL - 2021 మిగతా సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో BCCI కీలక ప్రకటన చేసింది. IPL జరిగే సమయంలో ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి, స్టేక్ హోల్డర్స్‌కి ఇలా మొత్తం అందరికీ కలిపి 30వేల RT - PCR టెస్టులు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ANIకి తెలిపింది.
సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు UAE వేదికగా IPL - 2021 మిగతా సీజన్ జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగానే ఈ ఏడాది సీజన్ అర్థంతరంగా ముగిసింది. దీంతో ఈ సారి ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు BCCI అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది UAEలో ఈ లీగ్ నిర్వహించినప్పుడు ఐదు రోజులకొకసారి ఆటగాళ్లకు, సిబ్బందికి, స్టేక్ హోల్డర్స్‌కి కరోనా టెస్టులు నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు మూడు రోజులకొకసారి నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మొత్తం 100 మందితో ప్రత్యేక మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.
సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు 31 IPL మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్ జరిగే రోజు స్టేడియంలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్‌తో కూడిన రెండు టీంలు అందుబాటులో ఉంటాయి. దుబాయ్, అబుదాబిలో ఆటగాళ్లు బస చేసేందుకు ఎంపిక చేసిన 14 హోటళ్లలోని 750 మంది సిబ్బందికి ఇప్పటికే టెస్టులు నిర్వహిస్తున్నారు. IPL ప్రారంభమైన తర్వాత ప్రతి రోజూ రెండు వేల టెస్టులు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెస్టుల ఫలితాలు 6 నుంచి 8 గంటల్లోపు వస్తాయి. గత ఏడాది IPL నిర్వహించిన సమయంలో మొత్తం 44వేల టెస్టులు నిర్వహించినట్లు UAE మెడికల్ టీం తెలిపింది.
సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న IPL తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ x చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు క్వారంటైన్ ముగించుకుని వరుస ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నారు.
Also Read: Shubman Gill: యువ క్రికెటర్ శుభ్‌మన్‌గిల్ పుట్టిన రోజు... త్వరలో IPLలో దర్శనమివ్వనున్న గిల్