Chess World Cup: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్ తరువాత ఆ ఘనత సాధించిన ఆటగాడు
Chess World Cup: భారత యువ చెస్ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.
Chess World Cup: భారత యువ చెస్ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. వరల్డ్ గ్రాండ్ మాస్టర్ సొంతం చేసుకునేందుకు ప్రజ్ఞానంద ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కీలక టై బ్రేక్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరునా (అమెరికా)ను 3.5-2.5 ఆధిక్యంతో మట్టికరిపించి ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లి ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు.
అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్ 2023 సెమీ-ఫైనల్‌లో 3.5-2.5 తేడాతో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరునాను ఓడించాడు. మొదట వీరిద్దరి మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ఆది నుంచి టాప్ ఆటగాడైన కరువానాకు ప్రజ్ఞానంద గట్టి పోటీనిచ్చాడు. టైబ్రేక్‌లోనూ పట్టు వదలకుండా పోరాడాడు. కీలక టైబ్రేక్‌లో ప్రతిభ చూపిన ప్రజ్ఞానంద, ప్రత్యర్థి ఫాబియానోను ఓడించారు.
Pragg goes through to the final! He beats Fabiano Caruana in the tiebreak and will face Magnus Carlsen now.
— Viswanathan Anand (@vishy64theking) August 21, 2023
What a performance!@FIDE_chess #FIDEWorldCup2023
కరునాపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసిన రమేష్‌బాబు ప్రజ్ఞానంద 2024 క్యాండిడేట్ టోర్నీలో చోటు ఖాయం చేసుకున్నాడు. తక్కువ వయసులోనే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిన మూడో ఆటగాడిగానూ ప్రజ్ఞానంద ఘనతకెక్కారు. 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్ ఫార్మాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడు కూడా ప్రజ్ఞానంద కావడం విశేషం. టైటిల్ కోసం ప్రపంచ నంబర్ మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే)తో ఫైనల్‌లో పోటీ పడనున్నారు. చెస్ ప్రపంచకప్ 2023 టైటిల్ పోరులో భాగంగా రెండు క్లాసికల్ గేమ్‌లు వీరిద్దరి మధ్య జరుగనున్నాయి. తొలి గేమ్ నేడు జరుగుతుంది.
ఫాబియానోను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లడంపై ప్రజ్ఞానంద ఆనందం వ్యక్తం చేశారు. తాను ఈ టోర్నీలో మాగ్నస్‌తో తలపడతానని అనుకోలేదన్నారు. మాగ్నస్‌తో ఆటడాలంటే కేవలం అది ఫైనల్‌లోనే సాధ్యమని, అది చేరుకుంటానని తాను ఊహించలేదనన్నారు. ఫైనల్‌లో గెలుపొందేందుకు శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తానని అన్నారు.
ప్రజ్ఞానంద ఫైనల్‌కు అర్హత సాధించడంపై ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఫాబియానో కరునాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్‌కు దూసుకెళ్లడం గొప్ప విషయం అన్నారు. మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఫైనల్ పోరుకు దిగనున్నాడని, వాటే పర్‌ఫామెన్స్ అంటూ సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశాడు.
ప్రజ్ఞానంద ఫైనల్‌కు చేరుకోవడంపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. విశ్వనాథన్ ఆనంద్ తరువాత భారత్‌కు చెస్‌లో దొరికిన ఆణిముత్యమని ప్రసంశలు కురిపిస్తున్నారు. ఫైనల్‌లో మాగ్నస్ కార్ల్‌సన్‌పై విజయం సాధించి ప్రపంచ కప్‌తో ఇండియాకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. తుది పోరుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.