ENG vs PAK Series: మొన్న న్యూజిలాండ్, ఇప్పుడు ఇంగ్లండ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్!
వచ్చే నెలలో పాకిస్తాన్‌తో జరగాల్సిన సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
పాకిస్తాన్‌లో వచ్చే నెల జరగాల్సిన క్రికెట్ సిరీస్‌ను ఇంగ్లండ్ రద్దు చేసుకుంది. ఇది పాకిస్తాన్ బోర్డుకు గట్టి ఎదురు దెబ్బే. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ మానసిక, శారీరకంగా ఆరోగ్యం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వచ్చే నెలలో ఇరు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. పురుషుల జట్టుతో మహిళల జట్టు కూడా పాకిస్తాన్‌లో సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లను రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ ప్రకటించింది.
చాలా కాలం నుంచి కోవిడ్ పరిస్థితుల్లో నివసిస్తున్న ఆటగాళ్లకు ఇప్పుడు ప్రయాణం చేయడం, మరో ప్రాంతానికి వెళ్లడం వంటివి ఒత్తిడిని కలిగిస్తాయని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. పురుషుల టీ20 ప్రపంచ కప్‌కే తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం చేసి ఆ టోర్నీ సన్నాహాలను రిస్క్‌లో పెట్టలేమంది.
ఈ నిర్ణయం పీసీబీకి నిరాశ కలిగిస్తుందని తెలుసని, తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణకు పీసీబీ ఎంతగానో ప్రయత్నిస్తుందని ప్రకటనలో తెలిపింది. ఇంగ్లిష్ క్రికెట్‌కు గత రెండు వేసవులుగా వారు చేసిన సేవలను మరవలేమంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మనస్పూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నట్లు పేర్కొంది.
కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌లో సిరీస్‌ను రద్దు చేసుకుంది. అయితే న్యూజిలాండ్ భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది . అయితే మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు న్యూజిలాండ్ ఈ ప్రకటన చేయడం అప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా, మొత్తం సిరీస్‌ను న్యూజిలాండ్ రద్దు చేసుకుంది.
న్యూజిలాండ్ ప్రభుత్వం అందించిన సెక్యూరిటీ అలెర్ట్ కారణంగా ఈ టూర్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయించామని న్యూజిలాండ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అప్పుడు తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఈ నిర్ణయం ఎంత బాధ పెట్టి ఉంటుందో తమకు తెలుసని, వారి ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉందని డేవిడ్ పేర్కొన్నారు. తమకు ఇది తప్ప మరో ఆప్షన్ కనిపించలేదన్నారు.
దీనిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఇది ఏకపక్ష నిర్ణయమని తెలిపింది. భద్రతా కారణాలను చూపిస్తూ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తమకు మ్యాచ్ జరిగే ముందే సమాచారం అందించిందని పీసీబీ తన ప్రకటనలో పేర్కొంది. తమ దేశానికి వచ్చే అన్ని జట్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ ప్రభుత్వం అత్యుత్తమ భద్రతను అందిస్తుందని తెలిపింది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి, న్యూజిలాండ్ ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడారని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో తమది కూడా ఒకటని, న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఎటువంటి ముప్పూ లేదని చెప్పారని, షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లను ఆడటానికి ఇప్పటికీ తాము సుముఖులమేనని పీసీబీ తెలిపింది. సమీప భవిష్యత్తులో ఆస్ట్రేలియా కూడా పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.