Why Vizag Lucky For Team INDIA : లక్కీ గ్రౌండ్‌లో టీమిండియాకు కలసి వస్తుందా ? వైజాగ్ ఎందుకంత స్పెషల్ ?
వైజాగ్ క్రికెట్ స్టేడియంలో తొలి విజయం కోసం టీమ్ ఇండియా ఆశలు పెట్టుకుంది. గత చరిత్ర ఘనంగా ఉండటంతో పాటు లక్కీ గ్రౌండ్ గా పేరు తెచ్చుకోవడమే దీనికి కారణం.
Why Vizag Lucky For Team INDIA : విశాఖ స్టేడియం టీమ్ ఇండియాకు లక్కీ స్టేడియంగా చెబుతారు. ఇంతవరకూ ఇక్కడ 15 వన్డే మ్యాచ్ లు జరిగితే అందులో 9 మ్యాచ్‌లు ఇండియా నెగ్గింది. ఒకటి రద్దవగా, మరొక మ్యాచ్ టై అయింది. అలాగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరిగితే రెండూ ఇండియానే నెగ్గింది. ఇక రెండు టీ ట్వంటీ మ్యాచ్‌లు జరిగితే వాటిలో ఒకటి ఇండియా గెలవగా మరొకటి ఆస్ట్రేలియా గెలిచింది . ఇలా ఎలా చూసినా ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ ఈ స్టేడియంలో 90 శాతం వరకూ ఉన్నాయి .
1988లోనే విశాఖ లో తొలి మ్యాచ్ :
ఇప్పుడున్న మధురవాడ స్టేడియం ఏర్పడక ముందు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోనే టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడింది. 10 డిసెంబర్ 1988 న న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియానే గెలిచింది. ఆ తరువాత 1994 లో వెస్ట్ ఇండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మన జట్టే విజేత అయింది .
అచ్చి వచ్చిన స్టేడియంలో టీమ్ ఇండియా గెలుపు బాట పడుతుందా ?
2005లో మధురవాడ సమీపంలో నిర్మించిన ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో పాకిస్తాన్‌తో 5 ఏప్రిల్ 2005లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆంధ్ర క్రికెట్ అసిసియేషన్‌కు ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం ఇదే. దానితో బీసీసీఐ జరిపే మ్యాచ్‌లకు ఇదే వేదిక అవుతూ వస్తుంది. ఇక ప్రస్తుత 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు గెలిచిన సౌత్ ఆఫ్రికా టీమ్ కీలకమైన మూడో మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్ విజయం ఇక్కడే ఖాయం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు లక్కీ స్టేడియంలో గెలుపు బాట పట్టాలని టీమ్ ఇండియా చూస్తుంది. రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, షమీ, రాహుల్ లాంటి కీలక ప్లేయర్లు లేకుండానే బరిలో దిగిన టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్స్‌కు ఈ సిరీస్ ఒక పరీక్ష లాంటిది. మరి ఈ కీలక మ్యాచ్‌లో వేరేవిధమైన సత్తా చాటుతారో చూడాలి. అభిమానులు మాత్రం వైజాగ్ మ్యాచ్ కచ్చితంగా టీమ్ ఇండియాదే అంటున్నారు .
ప్రధాన ఆటగాళ్లంతా సెంచరీలు చేసింది ఈ స్టేడియంలోనే
భారత ఆటగాళ్లలో కీలక ప్లేయర్‌లు అంతా విశాఖలో సెంచరీలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ (పాత స్టేడియంలో), రోహిత్ శర్మ , కోహ్లీ (మూడు సెంచరీలు ), ధోని, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ఇక్కడ సెంచరీలు చేశారు. ఇక విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా నుంచి మార్క్ వా, రికీ పాంటింగ్, హైడెన్, మైఖేల్ క్లార్క్, శ్రీలంక క్రికెటర్ సమర సిల్వా, వెస్ట్ ఇండీస్ ఆటగాడు హోప్ విశాఖలోనే సెంచరీలు సాధించారు.