Rohit Sharma: థ్యాంక్యూ.. కెప్టెన్ రోహిత్ శర్మ , ముంబై, చెన్నై స్పెషల్ ట్వీట్స్
Rohit Sharma: అయిదు సార్లు ముంబైని విజేతగా నిలిపిన దిగ్గజ కెప్టెన్ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది.
ఐపీఎల్‌లో రోహిత్‌శర్మ సారథ్య శకానికి ముగిసింది. అయిదు సార్లు ముంబైని విజేతగా నిలిపిన దిగ్గజ కెప్టెన్ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్‌ను భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకున్న ముంబై... అతడికే సారధ్య బాధ్యతలు కట్టబెట్టింది.
ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై ముంబయి చేసిన ప్రత్యేక ట్వీట్ వైరల్‌గా మారింది. 2013లో రోహిత్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు తమను ఒక్కటే అడిగాడని...తమ మీద నమ్మకం ఉంచాలని చెప్పాడని ట్వీట్‌లో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ గుర్తు చేసుకుంది. గెలుపైనా.. ఓటమైనా నవ్వుతూ ఉండాలని చెప్పావని... పదేళ్ల కెప్టెన్సీ కెరీర్‌లో ఆరు ట్రోఫీలు సాధించావని... దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ జట్టును ముందుండి నడిపించావని... ముంబై ఇండియన్స్ ఆ ట్వీట్ రోహిత్‌కు ధన్యవాదాలు తెలిపింది. ధన్యవాదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ ముంబయి ఇండియన్స్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
మరోవైపు ముంబయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ అందించిన సేవలను కొనియాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్వీట్ చేసింది. 2013 నుంచి 2023.. దశాబ్దకాలంపాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా రోహిత్ నిలిచాడని కొనియాడింది. రోహిత్.. మీద తమకు చాలా గౌరవం ఉందని పేర్కొంటూ ధోనీ-రోహిత్ ఫొటోను CSK షేర్ చేసింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్టు చేశాడు.
గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ మధ్యే తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌మీడియా సైట్ల ద్వారా అభిమానులతో ముంబై ఇండియన్స్ పంచుకుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ను హార్దిక్ నడిపిస్తాడని ఫ్రాంఛైజీ ప్రకటించింది. రోహిత్ సారథ్యంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ గెలిచింది. 2013లో ఛాంపియన్స్ లీగ్ టీ20లోనూ విజేతగా నిలిచింది. అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా చెన్నైతో కలిసి ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇది కేవలం రోహిత్ శర్మ వల్లనే సాధ్యమైంది. 2013 మధ్యలో నుంచి 2023 వరకు అంటే 11 సీజన్ల పాటు ముంబయికి రోహిత్ సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా మొత్తం 163 మ్యాచ్‌ల్లో 91 విజయాలు అందుకున్నాడు. 68 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. నాలుగు టై అయ్యాయి. మరోవైపు 2015లో ఐపీఎల్ అరంగేట్రం నుంచి 2021 వరకు ముంబయితోనే ఆడిన హార్దిక్.. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్ అయ్యాడు. ఆ ఏడాది ట్రోఫీ గెలిచిన జట్టు ఈ సారి రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల హార్దిక్ తిరిగి ముంబయి గూటికే చేరాడు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా..వారసత్వాన్ని కొనసాగించేందుకు ముంబై ఇండియన్స్ మొగ్గుచూపిందని ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ మహేల జయవర్ధనె పేర్కొన్నాడు. సచిన్ నుంచి హర్భజన్‌సింగ్, రికీ పాంటింగ్ నుంచి రోహిత్‌శర్మ, ఇప్పుడు రోహిత్ నుంచి హార్దిక్‌కు నాయకత్వ బదిలీ జరిగిందని తెలిపాడు. అమోఘమైన సారథ్య నైపుణ్యాలు ప్రదర్శించిన రోహిత్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నామని.. 2013 నుంచి జట్టు కెప్టెన్‌గా అతని ప్రయాణం అసాధారణమని జయవర్దనే అన్నాడు. రోహిత్ అనుభవాన్ని ఉపయోగించుకుని జట్టును మరింత బలంగా మారుస్తామని.. ముంబయి కొత్త కెప్టెన్‌గా హార్దిక్‌కు స్వాగతమని మహేల అన్నాడు.